Omicron cases in Telangana: రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడటంతో హైదరాబాద్ టోలిచౌక్‌లోని పారామౌంట్ కాలనీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇటీవల కెన్యా నుంచి పారామౌంట్ కాలనీకి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధరణ కావడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖ అధికారులు.. పారామౌంట్ కాలనీని కంటెయిన్‌మెంట్‌జోన్‌గా ప్రకటించి జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. కాలనీలో అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాలనీకి రాకపోకలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు.
25 బృందాలు
Containment zone in paramount colony: 25 వైద్య బృందాలు అక్కడ 700 ఇళ్లకు తిరిగి ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. స్థానికంగా నివసించే కొంతమంది సోమాలియన్లు వైద్య పరీక్షలకు నిరాకరించడంతో.. పోలీసుల సహకారంతో సిబ్బంది ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేపట్టారు. వీటి నివేదికలు మరో 36 గంటల తర్వాత రానున్నాయి. ఆర్టీపీసీఆర్లో పాజిటివ్ వస్తే ఆ శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపనున్నారు.
హై అలర్ట్
టోలిచౌకిలో బుధవారం రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడటంతో జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ అప్రత్తమయ్యాయి. అక్కడ హై అలర్ట్ ప్రకటించాయి. అధికారులు రంగంలోకి దిగి బాధితులు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని అన్ని ప్లాట్లతోపాటు వాటికి అనుసంధానంగా ఉన్న మరికొన్నింటిలో నివాసితుల శాంపిళ్లు సేకరించి ఆర్టీపీసీఆర్ పరీక్షలకు పంపారు. ఫలితాలు 24 గంటల్లోపు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ రోజు వైద్యారోగ్య శాఖ నుంచి 25 బృందాలు రంగంలోకి దిగాయి. నిన్న కాలనీ మొత్తం క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారి చేశారు. బాధితులతో దగ్గరగా మెలిగిన వారిని హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. నగరంలో 30 సర్కిళ్లలో ప్రత్యేక బృందాలతో సిద్ధంగా ఉన్నామని, ఆరోగ్యశాఖతో సమన్వయం చేసుకుంటూ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నామని బల్దియా వెల్లడించింది.
ఎక్కడెక్కడ తిరిగారో..
విదేశాల నుంచి వచ్చిన వారికి ఒమిక్రాన్ తేలడంతో ట్రేసింగ్, టెస్టింగ్, ఐసొలేషన్ ప్రక్రియ కీలకంగా మారనుంది. అనారోగ్య సమస్యలకు చికిత్స కోసం వచ్చిన బాధితులు నగరంలోని రెండు కార్పొరేట్ ఆసుత్రులకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆసుపత్రుల్లో ఎవరెవరిని కలిశారు.. ఎన్ని రోజులు గడిపారు.. ఎక్కడెక్కడ తిరిగారు.. అనేది చాలా ముఖ్యం. ఈ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించడం పెద్ద పరీక్షగా మారింది.
విదేశీయుల అడ్డా... అద్దెకు ఇళ్లు
టోలిచౌకిలోని పారామౌంట్ కాలనీ చాలాకాలం నుంచి విదేశీయులకు అడ్డాగా మారింది. సోమాలియా, నైజీరియా, కెన్యా తదితర ఆఫ్రికా దేశాల నుంచి ఎక్కువ మంది చికిత్సలు, ఇతర పనులకు వచ్చి ఇక్కడే ఆశ్రయం పొందుతుంటారు. 2-3 నెలలు కుటుంబాలతో ఉంటారు.
ఇదీ చదవండి:'ఒమిక్రాన్ వ్యాప్తి 70రెట్లు ఎక్కువ.. కానీ ఆ విషయంలో మాత్రం వీక్!'