కరోనా రెండో దశ వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది. నిత్యం అనేక మంది వైరస్ బారిన పడుతున్నారు. మరెంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐజీ ఆసుపత్రుల ఆధ్వర్యంలో వైద్యుల బృందం పరిశీలన చేసింది. కరోనా రెండో దశలో యువతపై ఎక్కువగా ప్రభావం ఉన్నట్లు పరిశీలనలో తేలింది. రాబోయే రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 50లక్షలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. వైరస్ మ్యూటెంట్ చెందడం, వాక్సిన్ ఎక్కువ మంది తీసుకోకపోవడం కారణంగా మారినట్లు అభిప్రాయపడ్డారు. కానీ రోగం కన్నా భయమే చాలా మందిలో ప్రాణాలు తీస్తోందని వైద్యుల వారు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న మరణాల వార్తలు, సొంత వైద్యం చిట్కాలు , లేనిపోని అపోహలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఏఐజీ ఆస్పత్రుల ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఏడాది కాలంగా 20వేల మంది కొవిడ్ రోగులకు తమ ఆస్పత్రిలో వైద్యం అందించిన అనుభవంతో వారు ఓ ప్రొటోకాల్ రూపొందించారు. దేశంలో , రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాలు, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ పరిశీలించాకే తాము ఈ ప్రొటోకాల్ రూపొందించామని ఏఐజీ ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.
ప్రజలు అయోమయానికి గురవుతున్నారు...
సామాజిక మాధ్యమాల్లో అనేక అపనమ్మకాలు, పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. వీటి ద్వారా ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. భయం పెంచుకుని నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఈ సమస్య పరిష్కారంతో పాటు వైద్యులకు సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఏఐజీ ఆస్పత్రుల ఆధ్వర్యంలో ప్రొటోకాల్ తీసుకొచ్చాం. ప్రజలు, వైద్యులు తెలుసుకోవాల్సిన విషయాలను శాస్త్రీయ ఆధారాలతో సులభ పద్ధతిలో వివరించాం. -డా. డి.నాగేశ్వర్ రెడ్డి, ఏఐజీ ఆస్పత్రుల ఛైర్మన్