తెలంగాణ

telangana

ETV Bharat / state

వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్న కొవిడ్‌ రోగులు - కరోనా వార్తలు

కొంత మంది బాధ్యతారాహిత్యం చాలా మంది ప్రాణాలమిదికొస్తోంది. కరోనా పాజిటివ్​ అని తెలిసినా బయటకు వస్తూ కొవిడ్​ వ్యాప్తికి కారణమవుతున్నారు కొంత మంది. బస్సుల్లో ప్రయాణిస్తూ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు.

corona
కరోనా రోగులు

By

Published : May 11, 2021, 3:14 PM IST

* నిజామాబాద్‌ జిల్లాలో ఓ ప్రైవేటు ఉద్యోగికి కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కుటుంబం హైదరాబాద్‌లో ఉంటుందని అక్కడికి వెళ్లాడు. బస్సులో ప్రయాణం చేశాడు. అక్కడ పరీక్షలు చేయించుకున్నాక ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించారు. హైదరాబాద్‌లో చికిత్స ఖర్చు ఎక్కువ అవుతుందని నిజామాబాద్‌ జిల్లాలో తానుండే ఓ పట్టణానికి తిరిగి వచ్చి ఆసుపత్రిలో చేరాడు. తిరుగుప్రయాణం కూడా బస్సులోనే.

* హైదరాబాద్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగి వరంగల్‌ వెళ్లాడు. అపార్ట్‌మెంట్‌లో అందరితో కలుపుగోలుగా ఉండే అతను ఈసారి చడీచప్పుడు చేయట్లేదు. రోజంతా గడిచినా బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు ఆరా తీశారు. ఓ గదిలోనే ఉంటున్నాడని తెలిసింది. అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆ ఉద్యోగి తండ్రితో మాట్లాడగా కరోనా పాజిటివ్‌ అని చెప్పారు. భయంతో లిఫ్టు రెండ్రోజులు ఆపేశారు. అపార్టుమెంట్‌ అంతా శానిటైజేషన్‌ చేయించారు.

* అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దంపతులు కరోనాబారిన పడ్డారు. నిర్ధారణ అయ్యాక సొంతూరు విశాఖపట్నం వెళ్లిపోయారు. ఇదే భవనంలో మరో కుటుంబానికి కొవిడ్‌ సోకింది. వాళ్లు సైతం సొంతూరు వరంగల్‌కి వెళ్లిపోయారు.

..ఇలాంటివారి ధోరణి కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తికి కారణమవుతోంది. కరోనా పాజిటివ్‌ వచ్చినవాళ్లలో కొందరు నిర్ధరణ అయ్యాక ఉన్నచోటనే చికిత్స తీసుకోకుండా దూరప్రాంతాలకు వెళుతున్నారు. సాధారణ లక్షణాలతో పాటు, లక్షణాలు లేనివారిని ఇంట్లోనే ఉండి మందులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ చాలామంది వందల కి.మీ. ప్రయాణాలు చేస్తున్నారు. కరోనా రోగులు తాము ఇంటి నుంచి బయటకు వస్తే ఇతరులకు వ్యాపించే ముప్పు ఉంటుందన్న విషయాన్ని విస్మరిస్తున్నారు.
అన్నీ తెలిసీ నిర్లక్ష్యంగా..
కరోనా పాజిటివ్‌తో ప్రయాణం చేసేవారిలో ఎక్కువమంది బస్సులు, రైళ్లలో వెళుతున్నారు. ఒక్కో బస్సులో పదుల సంఖ్యలో, ఒక్కో రైల్లో వందల్లో ప్రయాణికులు ఉంటారు. అంతమంది ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని తెలిసినా నిర్లక్ష్యంగా ప్రజారవాణా వాహనాల్లో తిరుగుతున్నారు. ముంబయి నుంచి సికింద్రాబాద్‌, విజయవాడ మీదుగా విశాఖపట్నం వెెళ్లే రైళ్లలో కొవిడ్‌ రోగులు ప్రయాణం చేస్తున్నట్లు వెల్లడైంది. ద.మ.రైల్వే జోన్‌ పరిధిలోని విజయవాడ రైల్వేస్టేషన్‌లో 1,223 మందిని పరీక్షించగా 70 మంది కొవిడ్‌ రోగులున్నట్లు తేలింది. ఇందులో 30 మంది ఐటీ ఉద్యోగులు. వీరిలో పలువురికి కొవిడ్‌ సోకినట్లు ముందే తెలుసు.
కారణాలు ఏంటి?
సొంతూరికివెళితే, అయినవారి మధ్య ధైర్యంగా ఉండొచ్చని చాలామంది ఊళ్లకు పయనమవుతున్నారు. ఉద్యోగరీత్యా దూరప్రాంతాల్లో ఉండే పెళ్లికాని యువతీ, యువకులు కొవిడ్‌ బారిన పడ్డాక ఒంటరిగా ఉండలేక సొంతూరికి వెళ్లిపోతున్నారు. మొత్తంగా చూస్తే ఇతర రాష్ట్రాల్లో, దూర నగరాల్లో ఉండేవారు.. తమకు సాయం చేసేవారు లేరన్న భావనతో సొంతూరు, సొంతింటికి కొవిడ్‌తో ప్రయాణం చేస్తున్నారు. కానీ తమ ద్వారా కుటుంబ సభ్యులకూ వ్యాపించే ముప్పు ఉంటుందన్న వాస్తవాన్ని గుర్తించడం లేదు. కొందరు మాత్రం తామున్నచోట చికిత్స ఖర్చు ఎక్కువనో, మరే ఇతర తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఐడీఏ బొల్లారంలో ఒక గదిలో ఉండే ఐదుగురు కార్మికులకు కొవిడ్‌ రాగా.. కొద్దిరోజులు చూసి రైల్లో ఒడిశాకు వెళ్లారు. కార్లు, ఇతర సొంత వాహనాల్లో సొంతూళ్లకు వెళుతున్నా, గంటల తరబడి వాహనంలో ప్రయాణంతో తమ కుటుంబ సభ్యులు ముప్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:'హ్యాపీ హైపోక్సియా'ను ఎలా గుర్తించాలి?

ABOUT THE AUTHOR

...view details