తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో మరో 11 మందికి కరోనా.. అన్నీ భాగ్యనగరంలోనే...

గ్రేటర్‌లో కరోనా మహమ్మారి పరంపర కొనసాగుతోంది. తాజాగా నగరంలో మరికొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన అధికారులు కొత్తగా పాజిటివ్​ కేసులు నమోదైన ప్రాంతాలను కంటెయిన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించి అక్కడ రాకపోకలపై నియంత్రణ పెట్టారు.

Hyderabad covid-19 news
Hyderabad covid-19 news

By

Published : May 6, 2020, 8:03 AM IST

రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 11 కేసులు రాగా అవన్నీ గ్రేటర్‌ హైదరాబాద్​లోని ఆయా ప్రాంతాల్లోనివే కావడం గమనార్హం. అధికారులు కరోనా కేసులు వచ్చిన ప్రాంతాలను కంటెయిన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించి అక్కడ రాకపోకలపై నియంత్రణ పెట్టారు. మొత్తం గాంధీలో ప్రస్తుతం 484 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఇందులో 95 శాతం మందిలో ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

తనయుడి ద్వారా తండ్రికి...

ఇటీవల జియాగూడ సాయిదుర్గానగర్‌కు చెందిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి కరోనా సోకిన విషయం తెలిసిందే. కాగా అతని తండ్రి (52)కి కూడా మంగళవారం కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు కుల్సుంపురా ఎస్సై సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కుటుంబంలో ఇప్పటికే ఆరుగురికి కరోనా సోకడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. వారు ఎవరెవర్ని కలిశారనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.

ట్రాన్స్‌పోర్టు కంపెనీ ఉద్యోగికి...

ఛత్రినాక ఠాణా పరిధిలోని లక్ష్మీనగర్‌లో తాజాగా ఓ వ్యక్తి(45)కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇతను మలక్‌పేట గంజ్‌లోని ఓ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో పనిచేస్తున్నాడు. దగ్గుతో బాధపడుతున్న అతడిని వైద్య సిబ్బంది ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మందులు రాసిచ్చి పంపించారు. ఆదివారం ఆరోగ్యం విషమించడం వల్ల కింగ్‌కోఠి ఆసుపత్రికి తరలించారు. పరీక్షల్లో కరోనా నిర్ధారణ కావడంతో మంగళవారం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతడి భార్య, కుమారుడు, కుమార్తెను వైద్య పరీక్షల నిమిత్తం కింగ్‌కోఠి ఆసుపత్రికి తరలించారు. గంజ్‌ నుంచి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించి, అతడు పనిచేసే కంపెనీలో ఇతర సిబ్బందికి పరీక్షలు నిర్వహించాలని సమాచారం అందించారు.

పల్టన్‌లో మరో కేసు...

చాదర్‌ఘాట్‌ ఠాణా పరిధిలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. అక్బర్‌బాగ్‌లోని పల్టన్‌కు చెందిన వ్యక్తి(57)కి వైరస్‌ సోకినట్లు తేలింది. ఆయన మల్లేపల్లిలో మెడికల్‌ దుకాణాన్ని నిర్వహిస్తుంటారు. అనుమానిత లక్షణాలు ఉండటంతో స్వతహాగా సోమవారం గాంధీ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. మంగళవారం పాజిటివ్‌గా తేలింది. ఇతనికి ఎవరి నుంచి వైరస్‌ సోకిందనే దానిపై ఆరా తీస్తున్నారు.

నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు కరోనా అనుమానితులు నల్లకుంటలోని ఫీవరాసుపత్రిలో చేరారు. మంగళవారం అశోక్‌నగర్‌, బోడుప్పల్‌, మేడ్చల్‌, వనస్థలిపురం నుంచి వచ్చిన పలువురిని వైద్యులు పరీక్షించారు. వీరిలో 8 మందికి కొవిడ్‌-19 లక్షణాలుండడం వల్ల ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీరిలో వనస్థలిపురంలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురున్నట్లు అధికారులు తెలిపారు.

3 కుటుంబాల్లో 15 మంది...

హయత్‌నగర్‌ డివిజన్‌లోని హుడాసాయినగర్‌లో ఉంటున్న వ్యక్తి(32)కి మంగళవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఇతని భార్య, కుమార్తె(5), కుమారుడి(3)ని వైద్య పరీక్షల నిమిత్తం కింగ్‌కోఠి ఆసుపత్రికి అధికారులు తరలించారు. ఈనెల 3న సదరు వ్యక్తి తల్లికి కరోనా సోకడం వల్ల ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఆమె కూతురు, అల్లుడు, ఇద్దరు మనవళ్లకు సైతం సోమవారం కరోనా నిర్ధారణ కావడంతో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వనస్థలిపురంలో మూడు కుటుంబాల్లో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 15కు చేరింది.

ఛాతీ ఆసుపత్రిలో ముగ్గురు...

ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిలో మంగళవారం నాటికి ముగ్గురు కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరు కరోనా నిర్ధారణతో చికిత్స పొందుతుండగా, ఒకరు అనుమానిత లక్షణాలతో చేరారు. అంతకుముందు అనుమానిత లక్షణాలతో చేరిన నలుగురికి కరోనా లేకపోవడం వల్ల వైద్యులు డిశ్ఛార్జి చేశారు.

ABOUT THE AUTHOR

...view details