వనస్థలిపురం పరిధిలో ఒకే కుటుంబంలో 8 మందికి సోకిన కరోనా.. అందులో ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. మిగతా ఆరుగురిని ఆస్పత్రిపాల్జేసింది. వీరికి సన్నిహితంగా ఉన్న 169 కుటుంబాలను అధికారులు స్వీయ నిర్బంధంలో ఉంచారు. వనస్థలిపురం రైతుబజారు సమీపంలో ఉంటున్న ఓ కుటుంబంలో ముగ్గురికి సోకింది. వీరి ద్వారా ఎస్‌కేడీనగర్, మరో ప్రాంతంలోని బంధువుల కుటుంబాలకు చెందిన అయిదుగురు కరోనా బారినపడ్డారు. ఇందులో ఇద్దరు పిల్లలూ ఉన్నారు.
వనస్థలిపురంలోని బాధితులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న 52 కుటుంబాలను, ఎస్‌కేడీనగర్‌లోని బాధితులతో సన్నిహితంగా ఉన్న మరో 117 కుటుంబాలను హోం క్వారంటైన్‌లో ఉంచారు. వీరుగాక స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి చెందిన 25 మందినీ హోం క్వారంటైన్‌లో ఉంచారు. లాక్‌డౌన్ వేళ నిబంధనలకు విరుద్ధంగా ఓ వ్యక్తికి చికిత్స చేసిన వనస్థలిపురంలోని జీవన్‌సాయి ఆసుపత్రిని శనివారం జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. ఎస్‌కేడీనగర్, వనస్థలిపురం రైతుబజార్ సమీపంలోని ‘ఎ టైప్’ క్వార్టర్స్, ‘బి టైప్’ క్వార్టర్స్ కాలనీలను కంటెయిన్‌మెంట్‌లుగా చేశారు.
ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిలో 9 మంది, ఫీవరాసుపత్రిలో ఏడుగురు శనివారం అనుమానిత లక్షణాలతో చేరారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి చికిత్సకు నిమ్స్‌కు రాగా కరోనా లక్షణాలుగా అనుమానించి వైద్యులు గాంధీకి తరలించారు. అలాగే కుందన్‌బాగ్‌లో ఓ వ్యక్తి(55)కి కరోనా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇతను ఓ అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తాడు.
మరో వైపు ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని పంజాగుట్ట, సోమాజిగూడలతో పాటు బల్కంపేటలో ఒక ప్రాంతం, చంచల్‌గూడలోని నుక్కడ్ ప్రాంతంలోని వీధిలోని కంటెయిన్‌మెంట్ జోన్లను శనివారం అధికారులు ఎత్తివేశారు.
కడచూపునకూ నోచుకోలేదు...
కరోనాతో మృతి చెందిన తండ్రి కడచూపునకు కుమారులు నోచుకోలేదు. మాదన్నపేట ఠాణా పరిధిలో ఉంటున్న వృద్ధుడు నెల కిందట ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. అతనికి సరైన చికిత్స అందడం లేదని కుమారులిద్దరు వైద్యులతో గొడవపడటంతో కేసు నమోదైంది. వీరికీ కరోనా సోకడం వల్ల గాంధీలో చికిత్స చేశారు. శనివారం పరీక్షల్లో వీరికి నెగిటివ్ రావడం వల్ల నేరుగా చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇదే రోజు తండ్రి మృతి చెందడంతో వారిద్దరికీ మధ్యంతర బెయిల్ మంజూరైంది. కానీ అంత్యక్రియలకు వారిని అనుమతించక పోవడం వల్ల తండ్రిని కడసారి చూసుకోలేక పోయారు. తండ్రి చికిత్స కోసమే గొడవపడి.. ఆఖరికి చివరి చూపునకు నోచుకోలేకపోయామని కంటతడిపెట్టారు.
ఎల్బీనగర్ జోన్‌పై వైరస్ పంజా...
ఎల్బీనగర్ ప్రాంతంలో కరోనా విజృంభిస్తోంది. ఎల్బీనగర్ జోనల్ పరిధిలో సరూర్‌నగర్ సర్కిల్‌లో ఐదుగురు, ఎల్బీనగర్‌లో 9, హయత్‌నగర్ సర్కిల్‌లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ఒక్క శనివారమే ఎల్బీనగర్ ప్రాంతంలో ఎనిమిది కేసులు బయటపడ్డాయి. వాస్తవానికి ఇప్పటివరకు వచ్చిన కేసుల్లో 11 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. సరూర్‌నగర్‌లో నివాసం ఉండే వ్యక్తి మలక్‌పేట మార్కెట్‌లో వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి తొలుత పాజిటివ్ రాగా.. కుటుంబంలోని పది మందికి సోకింది. వీరంతా వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి, సరూర్‌నగర్ ప్రాంతంలో వేర్వేరుగా ఉంటున్నా.. ఓ ఫంక్షన్‌లో కలుసుకోవడం వల్లే వైరస్ సోకిందని అధికారులు చెబుతున్నారు. శనివారం వెలుగు చూసిన కేసుల్లో సదరు వ్యాపారి కుటుంబానికి చెందిన వారే ఆరుగురు ఉన్నారు.
వనస్థలిపురంలో కలెక్టర్ ఆరా...
వనస్థలిపురంలో కరోనా నివారణ చర్యలను పటిష్ఠంగా అమలు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్, అదనపు కలెక్టర్ హరీశ్‌లు అధికారులను ఆదేశించారు.ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వనస్థలిపురం, పరిసర కాలనీల ప్రజలకు వైద్య సలహాలు అందజేసేందుకు అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ వాసులు 99513 21540, 79958 03686, వనస్థలిపురం డివిజన్ ప్రజలు 92900 18626, 70953 40313 చరవాణి నంబర్లలో సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.