లాక్‌డౌన్ నిబంధనల్లో భారీగా సడలింపులు ఇవ్వటం వల్ల జంటనగరాల్లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజలు పూర్తిస్థాయిలో రోడ్లపైకి వస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో కార్యకలాపాలు మునుపటి స్థాయిలో సాగుతున్నాయి.
చిరు తిండ్ల కోసం బారులు...
భాగ్యనగరంలో కరోనా తీవ్రతపై అధికారులు హెచ్చరికలు చేస్తున్నా... ప్రజలు మాత్రం వాటిని అంతగా పట్టించుకోవటం లేదు. మాస్కులు ధరించటం, సామాజిక దూరం పాటించటం వంటి సూచనలు పెడచెవిన పెడుతున్నారు. దుకాణాలు, చిరు తిండ్ల కోసం బారులు తీరుతున్నారు. కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో ఉన్న ప్రమాద తీవ్రతను కూడా ప్రజలు పట్టించుకోవటం లేదు.
నిమ్స్ ఆసుపత్రిలో ఓ మహిళకు కరోనా పాజిటివ్...
నగరంలో ఇప్పటికే విస్తరించి ఉన్న కరోనాతో పాటు బయటి దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వేల మంది కారణంగా పరిస్థితి నానాటికీ చేయి దాటి పోతోంది. నిమ్స్ ఆస్పత్రిలో మరికొంత మంది వైద్యులు, సిబ్బందికి ఇవాళ కరోనా పరీక్షలు చేశారు. కిడ్నీ సమస్యతో నిమ్స్‌లో మూడు రోజుల క్రితం చేరిన ఓ మహిళకు గురువారం అనుమానంతో పరీక్షలు నిర్వహించగా ఆమెకు పాజిటీవ్‌గా తేలింది. దీంతో డయాలసిస్ విభాగంలో వైద్యులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు.
గాంధీలో గర్భిణీ మృతి...
మొదటి నుంచి ప్రమాద ఘంటికలు మోగిస్తున్న అంబర్‌పేటలో గురువారం ఒక్కరోజే 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో ఇవాళ ఓ గర్భిణీ గాంధీ ఆసుపత్రిలో కన్నుమూసింది. బాలానగర్‌లోని వినాయక్ నగర్లో 64 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకగా.. ఎర్రగడ్డ డివిజన్లోని న్యూ ప్రేమ్ నగర్లో 45 ఏళ్ల మహిళకు కరోనా నిర్ధరణ జరిగింది. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్ వాణినగర్‌లో 55 ఏళ్ల వ్యక్తికి కరోనా వచ్చింది.
ఆరునెలల పాపకు కొవిడ్-19...
గిరినగర్‌లో ఓ ఆరునెలల పాపకు కరోనా సోకగా.. తల్లిదండ్రులకు మాత్రం నెగటివ్ వచ్చింది. హైదరాబాద్ లోని ఆర్బీఐ కార్యాలయంలో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కావటం వల్ల కార్యాలయాన్ని మూసివేసినట్టు తెలిసింది. మేడ్చల్ జిల్లా చింతలపల్లి మండలంలో ఓ వృద్ధుడికి కరోనా నిర్ధరణ అయింది. దీంతో ఆయన్ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.