భాగ్యనగరంలో కరోనా వైరస్ తీవత్ర రోజురోజుకు భారీగా విస్తరిస్తోంది. బల్దియా అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కేసుల సంఖ్య తగ్గడం లేదు. లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన నాటి నుంచి జనాలు భయట తిరగడం... దుకాణాలు, షాపింగ్‌లకు వెళ్లడం వల్ల కేసులు భారీగా నమోదు అవుతున్నాయాని అధికారులు అంచనా వేస్తున్నారు.
బస్తీల్లో ఎక్కువగా కేసులు నమోదు కావడం వల్ల జీహెచ్ఎంసీ అధికారులు వాటిపై దృష్టిసారించారు. బస్తీల్లో తిరుగుతూ ప్రజలకు కరోనా నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇక కంటైన్మెంట్ జోన్లతో పాటు ఇతర ఏరియాల్లో రెండో విడత రసాయనాల పిచికారీ మొదలు పెట్టారు ఎంటమాలజీ అధికారులు. మరోవైపు డీఆర్ఎఫ్ బృందాలు కూడా రసాయనాలను స్ప్రే చేస్తున్నాయి.
కానిస్టేబుల్‌కు కరోనా...
ఆదివారం కూడా హైదరాబాద్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ వచ్చిన రాంనగర్‌లోని బట్టల దుకాణం యజమాని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మంగళహాట్‌లో ఓ కానిస్టేబుల్‌తో పాటు... మరోకరు కరోనా భారిన పడ్డారు.
కూరగాయల వ్యాపారికి కరోనా పాజిటివ్...
హైదర్‌గూడలోని ముత్యాలబాగ్లో ఓ కూరగాయల వ్యాపారికి కరోనా సోకింది. అతని కుటుంబ సభ్యులకు లక్షణాలు ఉండడం వల్ల వారికి కూడా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఆ కూరగాయల వ్యాపారి దగ్గర ఎంతమంది కూరగాయలు కొన్నారనే విషయాలపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. మల్లాపూర్ డివిజన్ ఎస్వీ నగర్‌కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. గచ్చిబౌలి ఇంద్రానగర్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ముషీరాబాద్‌లో ఒకరు మృతి...
ముషీరాబాద్ నియోజకవర్గంలో కొవిడ్-19తో ఒక వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మృతుని భార్యతో పాటు ఆయన కూతురికి కూడా కరోనా సోకింది. జెమిస్థాన్ పూర్ చేపల మార్కెట్ వద్ద నివసించే ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన కుటుంబంలోని పది మందిని హోం క్వారంటైన్ చేసినట్లు వైద్య సిబ్బంది వెల్లడించారు. మేదర్ బస్తీలో ఇటీవల వృద్ధురాలికి కరోనా పాజిటివ్ రాగా ఆమెకు సంబంధించిన కుటుంబంలోనే పదహారేళ్ల అమ్మాయి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇదే బస్తీలోని ఓ హోటల్లో పనిచేసే కార్మికుడికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది.
నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి కరోనా లక్షణాలతో వచ్చిన నలుగురికి పరీక్షలు నిర్వహించారు. శనివారం 16 మందికి నిర్వహించిన పరీక్షల్లో 9 పాజిటివ్ కేసులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంకో రెండు రిపోర్ట్స్ అందాల్సి ఉందని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. అంబర్ పేట్ పరిధిలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాచిగూడలోని కుత్బిగూడాకు చెందిన ఓ 50 ఏళ్ల మహిళకు పాజిటివ్ నిర్ధరణ అయింది. అంబర్పేట్ న్యూ పటేల్ నగర్లో ఓ వ్యక్తికి కరోనా సోకింది.
వికారాబాద్‌లో 3... రంగారెడ్డిలో 4...
వికారాబాద్ జిల్లా యాలాల మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకినట్లు మండల వైద్యాధికారి ధ్రువీకరించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్ నగర్లో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల కరోనా వచ్చిన ఓ వ్యక్తి కుటుంబంలోని వారందరికి కరోనా సోకినట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు.