ధాన్యం కొనుగోళ్ల వేళ వ్యవసాయశాఖను కరోనా తరుముతోంది. గ్రామాల్లో తిరుగుతూ నిత్యం రైతులను కలవాల్సిన వ్యవసాయ, ఉద్యాన అధికారులు కరోనా భయంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని వ్యవసాయ కమిషనరేట్లో 8 మందికి, ఉద్యానశాఖ కమిషనరేట్లో ఆరుగురికి, క్షేత్రస్థాయిలో 9 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. గ్రామ, మండల స్థాయిలో పనిచేసే పలువురు వ్యవసాయ, ఉద్యాన అధికారులు కరోనాతో బాధపడుతున్నారు. వ్యవసాయ కమిషనరేట్లో ఉపసంచాలకురాలి (డీడీ) భర్త కొవిడ్‌తో శుక్రవారం మరణించారు. సహాయ సంచాలకుడి (ఏడీ) అన్న, తండ్రి కరోనా బారిన పడి కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లాలో మండల మహిళా వ్యవసాయాధికారి (ఏఓ) భర్త కూడా వైరస్ కారణంగా మరణించారు.
ధాన్యం కొనుగోళ్ల వేళ భయంభయం - Corona pandemic plaguing farm officials
కరోనా కారణంగా వ్యాపార, వాణిజ్య రంగాల్లో తీవ్రనష్టం జరుగుతోంది. వ్యవసాయరంగంపై కొవిడ్ పంజా విసురుతోంది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే సమయంలో వారిని ఆందోళనకు గురిచేస్తోంది. నిత్యం రైతులను కలవాల్సిన వ్యవసాయ, ఉద్యాన అధికారులు మహమ్మారి కారణంగా ఇళ్ల నుంచి అడుగుబయటపెట్టడానికే వణికిపోతున్నారు. ఇప్పటికే పలువురు ఈ వైరస్ బారినపడగా, మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.
వ్యవసాయశాఖ కమిషనర్, ముఖ్యకార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి సైతం కరోనా సోకి కోలుకున్నారు. పబ్లిక్ గార్డెన్స్‌లోని ఉద్యాన శాఖ కమిషనరేట్లలోనూ కొందరు ఉద్యోగులు కొవిడ్‌తో ఆందోళన చెందుతున్నారు. నిత్యం గ్రామాల్లో రైతులను కలవాల్సి ఉన్నందున క్షేత్రస్థాయి అధికారులు భయపడుతున్నారు. గ్రామాల్లో ప్రభుత్వం వేలాది ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది. రైతులు ముందుగా వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) దగ్గర పంట వివరాలతో చిట్టీ రాయించుకోవాలి. ఇందుకోసం ఎంతోమంది రైతులు, ఇతరులు ఏఈఓల దగ్గరికి వస్తుంటారు. మార్కెట్లకు వందలమంది రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు వస్తున్నారు. వీరిలో ఎవరికి పాజిటివ్ ఉన్నా మిగతావారికి సోకుతోందని ఓ అధికారి ‘ఈనాడు’కు చెప్పారు. మార్కెటింగ్‌శాఖలో సైతం పలువురికి పాజిటివ్ వచ్చింది.