కేపీహెచ్‌బీ పరిధి మూడోఫేజ్‌లో ఎంఐజీ నివాసాల్లోని ఓ యువకుడికి కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో అధికారులు ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా మార్చారు. కరోనా సోకిన యువకుడి నివాసాన్ని మేడ్చల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి వీరాంజనేయులు సోమవారం పరిశీలించారు. ఆ శాఖ సిబ్బంది 21 బృందాలుగా 1,975 ఇళ్లలో సర్వే నిర్వహించి దగ్గు, జలుబు, జ్వరంతో ఎవరైనా బాధపడుతున్నారా అని ఆరా తీశారు. యువకుడికి తాగునీరు సరఫరా చేసిన ఇద్దరిని, మందుల దుకాణానికి సంబంధించి ఒకరిని, ఇంటి కాపలాదారుణ్ని పరీక్షల నిమిత్తం ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రికి తరలించారు.
నేరేడ్మెట్లో ఇద్దరికి..
నేరేడ్మెట్లో ఈనెల 17న కరోనాతో చికిత్స పొందుతున్న వృద్ధుడి భార్య, మనవరాలికి సైతం కరోనా నిర్ధారణ అయింది. వీరితో పాటు మరో 25 మందిని సైతం క్వారంటైన్‌కు తరలించగా పరీక్ష ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.
ఛాతీ ఆసుపత్రిలో 14 మందికి చికిత్సలు
కొవిడ్-19 నిర్ధారణతో ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిలో 14 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని... వీరందరి పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్‌ఖాన్ తెలిపారు. వీరితోపాటు మరో 46 మంది అనుమానిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకున్న నలుగురిని డిశ్చార్జి చేశారు. కరోనా అనుమానిత లక్షణాలతో సోమవారం తొమ్మిది మంది నల్లకుంట ఫీవరాసుపత్రిలో చేరారు.
ఐటీ ఉద్యోగి మృతి.. శాంపిళ్ల సేకరణ
మణికొండకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయిన ఐటీ ఉద్యోగి వర్క్ ఫ్రం హోం విధానంలో విధులు నిర్వహించారు. చాలా కాలంగా మధుమేహంతో బాధపడుతున్నారు. గత శనివారం రాత్రి శ్వాస సమస్య వచ్చిన నేపథ్యంలో స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించగా మెరుగైన చికిత్స కోసం మరుసటి రోజు గచ్చిబౌలిలోని ఓ కార్పొరేటు ఆస్పత్రికి తరలించగా, కొద్దిసేపటికే మరణించారు. తీవ్రమైన మధుమేహంతో చనిపోయినట్లు వైద్యులు ప్రాథమికంగా తేల్చారు. శ్వాస సమస్యలు ఉన్న కారణంగా కరోనా పరీక్షల కోసం శాంపిళ్లు సేకరించారు. నేడు ఈ ఫలితాలు రానున్నట్లు అధికారులు తెలిపారు.
కంటైన్మెంట్గా ఆదర్శనగర్
తుర్కయాంజాల్ పురపాలికలోని మునగనూర్ ఆదర్శనగర్‌ను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఇక్కడ ఓ వ్యక్తికి కరోనా సోకిన విషయం విదితమే. అతని భార్య, ఇద్దరు పిల్లలతో పాటు ఆ కుటుంబంతో కలివిడిగా ఉన్న మరో 10 మంది స్థానికులను రావిర్యాలలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో..
వనస్థలిపురం డివిజన్లోని ఓ కాలనీలో కరోనా కేసు నమోదైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న ఉదయం ఆ ప్రాంతాన్ని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జెడ్పీ ఉపేందర్‌రెడ్డి, వనస్థలిపురం ఏసీపీ జయరాంతో కలిసి సందర్శించి ఆ పాంత్రాన్ని కంటైన్మెంట్గా ప్రకటించారు. ఇక్కడ కాపలాదారుగా పనిచేసే అసోంకు చెందిన వ్యక్తి గత నెల రైలులో నగరానికి వచ్చాడు. ఈనెల 19న కాలనీలో సర్వే చేస్తుండగా విషయం బయటపడింది. నమూనాలు సేకరించగా పాజిటివ్ అని తేలింది. మొత్తం 19 మందిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.