దేశంలో, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా నిర్వహించడం వల్లే వైరస్ ఇతర దేశాల మాదిరిగా ఎక్కువగా విస్తరించడం లేదనే సత్యాన్ని ప్రజలంతా గ్రహించి, పూర్తిగా సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. వైరస్ సోకిన వారిని గుర్తించి సత్వర చికిత్స అందించడం, వ్యాధిగ్రస్తులను కలిసిన వారిని గుర్తించి క్వారంటైన్ చేయడం వంటివి క్రమం తప్పకుండా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలని చెప్పారు.
వరికోతలు, ధాన్యం ఇతర పంటల కొనుగోళ్లు యథావిధిగా జరపాలని సూచించారు. రాష్ట్రంలో నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలన్నారు. కరోనాపై ఆయన శుక్రవారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్‌రావు, రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్‌డౌన్ అమలు, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగే దృశ్యమాధ్యమ సమీక్ష, ప్రస్తావించాల్సిన అంశాలు, మధ్యాహ్నం జరిగే మంత్రిమండలి సమావేశంలో చర్చించాల్సిన విషయాల గురించి కూడా సమాలోచనలు జరిపారు.
చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి..