ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు ఆధ్వర్యంలోని వైద్యబృందం బుధవారం ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా వ్యాధి తగ్గినట్లు(నెగెటివ్) నిర్ధారణ అయింది. దీంతో పాటు ఆయనకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు సైతం నిర్వహించారు. దీని ఫలితాలు నేడు రానున్నాయి. దానిలో నెగెటివ్ నిర్ధారణ అయితే శుక్రవారం నుంచి ఆయన విధుల్లో పాల్గొనే అవకాశం ఉంది.
ఈ నెల 14న సీఎం కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి ఆయన ఎర్రవల్లిలో వైద్య బృందం పర్యవేక్షణలో ఐసొలేషన్‌లో ఉన్నారు. ఈ నెల 21న ఆయనకు యశోదా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా లక్షణాలు తగ్గినట్లు తేలింది. ఆ తర్వాత కరోనా చికిత్స ప్రొటోకాల్ మేరకు 14 రోజుల గడువు ముగియడంతో బుధవారం మరోసారి యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ర్యాపిడ్ యాంటిజెన్‌లో నెగెటివ్ వచ్చినా.. తుది నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ ప్రామాణికంగా ఉన్నందున దానిలో నెగెటివ్ నివేదిక వచ్చాక సీఎం కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించనున్నారు.
ఉచిత టీకాలపై సమీక్ష
సీఎం కరోనా నుంచి కోలుకున్న వెంటనే రాష్ట్రంలో చేపట్టిన ఉచిత టీకాల కార్యక్రమంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వయసుతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని వారందరికీ ఉచిత టీకాను ఇస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు. వచ్చే నెల మొదటి తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారికి టీకాల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాని నిర్వహణ ఇతర అంశాలపై సీఎం సమీక్షలో చర్చిస్తారు.