తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా లాక్​డౌన్... విత్తన శుద్ధి, ఎరువులపై ప్రభావం - తెలంగాణ తాజా వార్తలు

కరోనా వైరస్ ప్రభావం వ్యవసాయ రంగంపై చూపుతోంది. లాక్​డౌన్ ప్రకటించిన నేపథ్యంలో విత్తన శుద్ధి, రసాయన ఎరువుల సరఫరాపైనా పడుతోంది. అవి నిత్యావసర వస్తువుల జాబితాలో ఉన్నందున రవాణాకు అనుమతించాలని సర్కారు నిర్ణయించింది. ఈ అంశంపై పోలీసు శాఖ నిఘా విభాగం ఐజీకి లేఖ రాయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇప్పుడు విత్తన శుద్ధి, రేక్ మూవ్‌మెంట్, సరఫరా వంటి అంశాలకు అంతరాయం ఏర్పడనుంది. రాబోయే ఖరీఫ్ పంట కాలంపై ప్రభావం చూపనున్నందున ఎక్కడా వాటిని అడ్డుకోకుండా అనుమతించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

Corona Lockdown impact on seed purification and Fertilizer in telangana
కరోనా లాక్​డౌన్... విత్తన శుద్ధి, ఎరువులపై ప్రభావం

By

Published : Mar 24, 2020, 7:33 AM IST

Updated : Mar 24, 2020, 8:28 AM IST

కరోనా లాక్​డౌన్... విత్తన శుద్ధి, ఎరువులపై ప్రభావం

రాబోయే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన విత్తనాల ఉత్పత్తి, ప్రొసెసింగ్‌పై కొవిడ్​ ప్రభావం పడింది. ప్రస్తుతం విత్తన శుద్ధి, ప్యాకింగ్‌ను విత్తన కంపెనీలు ఆపేస్తున్నాయి. ఆ పనులు జరగకపోతే వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా విత్తన విక్రయాలు చేయడం కష్టం. జాతీయ విత్తన కంపెనీల సంఘం తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చింది. తాజా యాసంగిలో సాగు చేసిన విత్తన పంటలు ఇప్పుడు పూత, కోత దశలోనే ఉన్నాయి. కోత తర్వాత రైతుల నుంచి అన్ని రకాల విత్తనాలు శుద్ధి చేసి తరలించాల్సి ఉంటుంది. అనంతరం నాణ్యత పరీక్షించి శుద్ధి చేసి ప్యాకింగ్ చేస్తేనే ఖరీఫ్‌కు అందించడం సాధ్యమవుతోంది.

రవాణా, అమ్మకాలకు అనుమతించాలి

రైతులకు 7.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలు రాయితీపై అందించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది అమలు కావాలంటే రైతుల నుంచి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ పంటలు కొని శుద్ధి ప్లాంట్లకు తరలించి ప్యాకింగ్ పనులు చేయాలి. విత్తనాలు నిత్యావసర చట్టం కిందకు వస్తాయి. లాక్​డౌన్‌లో నిత్యావసరాలకు మినహాయింపు ఇచ్చారు. ఆ దృష్ట్యా విత్తన శుద్ధి, రవాణా, అమ్మకాలకు అనుమతించాలని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖలు రాసినట్టు ఎన్‌ఎస్‌ఏ జాతీయ అధ్యక్షుడు ఎం.ప్రభాకర్‌రావు తెలిపారు. విత్తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులను ఐడీ కార్డుల ఆధారంగా అనుమతించాలన్నారు. విత్తనాలు రవాణా చేసే వాహనాలను ఆపకుండా చూడాలని సూచించారు.

లాక్‌ డౌన్ నుంచి మినహాయింపు

విత్తనాల తయారీ, అమ్మకాలకు అనుమతించకపోతే.. ఇబ్బందులు ఉత్పన్నమవుతాయని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ కేశవులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలో కోటి 10 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు సిద్ధం చేయాలని కంపెనీలకు వ్యవసాయ శాఖ సూచించింది. రసాయన ఎరువుల రేక్ మూవ్‌మెంట్‌ అనుమతించకపోతే.. ఇబ్బందులు వస్తాయన్న అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనుమతించాలని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న కంపెనీల విన్నపంపై సీఎం, ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

ఇదీ చూడండి :కవరేజ్ కోసం వచ్చిన రిపోర్టర్​పై పోలీసుల దాడి

Last Updated : Mar 24, 2020, 8:28 AM IST

ABOUT THE AUTHOR

...view details