తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా(కొవిడ్‌-19) కొత్త వైరస్సే!

కొవిడ్‌-19 వైరస్‌ పూర్తిగా కొత్తదని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా వెల్లడించారు. వైరస్‌ మనుషుల నుంచి మనుషులకే వ్యాప్తి చెందిందని.. వైరస్‌ సోకినవారిలో మరణాలు రెండు, మూడు శాతమే ఉన్నట్లు పేర్కొన్నారు.

HYD_Corona (Kovid-19) new virus!
కరోనా(కొవిడ్‌-19) కొత్త వైరస్సే!

By

Published : Mar 4, 2020, 8:08 AM IST

కరోనా(కొవిడ్‌-19) వైరస్‌ పూర్తిగా కొత్తదని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా అన్నారు. తొలుత జంతువుల్లో బయటపడి అక్కడి నుంచి మనుషులకు సోకిందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఈ వైరస్‌ మనుషుల నుంచి మనుషులకే వ్యాప్తి చెందిందని.. వైరస్‌ సోకినవారిలో మరణాలు రెండు, మూడు శాతమే ఉన్నట్లు పేర్కొన్నారు. గతంలో కంటే ఇప్పుడు సాంకేతికత, అవగాహన పెరిగాయని.. సమర్థ చర్యలు చేపట్టి వైరస్‌ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చంటున్న రాకేశ్‌ మిశ్రాతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తికి శాస్త్రీయ కారణాలేంటి..?

కొవిడ్‌-19 వైరస్‌ వేగంగా వ్యాప్తికి గల కచ్చితమైన శాస్త్రీయ కారణాలు ఇప్పటికీ తెలియవు. దీనిపైన పరిశోధనలు జరుగుతున్నాయి. వైరస్‌లు జీవకణాలపై దాడి చేసి వ్యాధులను కలిగిస్తాయి. కొన్ని జన్యుమార్పులు పక్కాగా జరిగినప్పుడు వైరస్‌లు వ్యాప్తిచెందుతుంటాయి. కొవిడ్‌-19 వైరస్‌ కూడా అలాంటిదే.

ఈవైరస్​ను నిరోధించలేమా..?

గతంలో ప్లేగు సోకినప్పుడు ఊళ్లకు ఊళ్లే నామరూపాల్లేకుండా పోయాయి. కానీ, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. మొన్నటివరకు మనల్ని భయపెట్టిన హెచ్‌ఐవీ వైరస్‌ వ్యాప్తి చెందకుండా సమర్థంగా నిరోధించగలుగుతున్నాం. వైరస్‌లకు టీకాల తయారీ చేసేలోపే మారిపోతుంటాయి. కొన్ని వైరస్‌లు ఎక్కువ కాలం ఉండవు కూడా..

రోగనిరోధక వ్యవస్థ బలోపేతం చేస్తే..

కొవిడ్‌-19 సాధారణ వైరసే. ఇప్పటికే దీనికి సంబంధించి చాలా విషయాలు బయటపడ్డాయి. ఎలా వ్యాప్తి చెందుతుంది? ఎంతకాలం జీవిస్తుంది? బయట ఎంతకాలం ఉంటుందనే విషయాలపై అవగాహన ఉంది. ఇప్పుడు చేయాల్సిందల్లా వైరస్‌ వ్యాప్తి చెందకుండా నిరోధించడం. చైనా ఈ విషయంలో అద్భుతంగా పనిచేస్తోంది.

వైద్య చికిత్స అందుబాటులో ఉందా..?

ఈ వైరస్‌కు ఇప్పటి వరకు నిరూపితమైన వైద్య చికిత్స లేదు కాబట్టి వ్యాప్తి చెందకుండా చూసుకోవాలి. వైరస్‌ సోకాలంటే ఏదైనా పరాన్నజీవి కావాలి. అది లేకుండా చూస్తే మూడు నాలుగు రోజులకే చచ్చిపోతుంది. కొవిడ్‌-19 లాంటి వైరస్‌లను తట్టుకునే రోగనిరోధకశక్తి మన శరీరానికి ఉంటుంది. దాన్ని బలోపేతం చేయాలి.

వేడి వాతావరణంలో రాదని చెప్పలేం

మన దగ్గర ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సీజనల్‌గా వచ్చేవే. వాతావరణం మారినప్పుడల్లా వీటి బారిన ఎక్కువగా పడుతుంటారు. అయితే, కాలాలతో సంబంధం లేకుండా కూడా జలుబుతో బాధపడటం మనం చూస్తుంటాం. వేడి వాతావరణంలో కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. కచ్చితంగా తక్కువ అని ఇప్పుడే చెప్పలేం. ఇన్ఫెక్షన్‌ ఉంటే బయటకు వెళ్లొద్దు.

మనుషుల నుంచే జంతువులకు ముప్పు

కరోనా వైరస్‌కు మూలం జంతువులేనని చెప్పడానికి ఇప్పటి వరకు శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. జంతువుల్లో ఇది ఎక్కువరోజులు బతకలేదు. పాంగోలిన్‌, గబ్బిలాల నుంచి వచ్చిందనేది ప్రచారం మాత్రమే. ఇవి కూడా జనసమూహాలకు దగ్గరగా తిరుగుతుంటాయి. మనుషులు సగం తిని పడేసిన పండ్లు, కూరగాయలు తిని ఉంటే వాటికి వచ్చి ఉంటుంది. నిజానికి అడవులు తగ్గడం ద్వారా మనుషుల నుంచి జంతువులకే ముప్పు పొంచి ఉంది. అవే కొత్త జబ్బుల బారిన పడుతున్నాయి. జంతువుల నుంచి మనుషులకు ఎప్పుడూ ప్రమాదం ఉండదు.

సాయం కోరితే చేస్తాం..

సీసీఎంబీ ఈ వైరస్‌పై సొంతంగా ఎలాంటి పరిశోధన చేయడం లేదు. ప్రభుత్వం, పరిశ్రమలు ముందుకొచ్చి డిటెక్షన్‌, యాంటీ వైరల్స్‌పై సాయం కావాలని కోరితే తప్పకుండా అందిస్తాం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • కరోనా వైరస్‌, ఇతర ఫ్లూ లక్షణాలు ఉన్నవారు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి.
  • జలుబు, దగ్గు, జ్వరం ఉంటే ఇంటికే పరిమితం కావాలి.
  • పెద్దవాళ్లు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. బాగా నీళ్లు తాగాలి. బలవర్ధక ఆహారంతీసుకోవాలి.
  • తుమ్మినప్పుడు ఇతరులకు మీటర్‌ దూరంలో ఉండటం మేలు. ఆలింగనం చేసుకోవడం, కరచాలనం కొద్దిరోజులు మానేయడం మంచిది.
  • బాత్రూమ్‌ కమోడ్‌ బటన్‌, మెట్ల రెయిలింగ్‌ వంటివి పట్టుకున్నప్పుడు చేతులను ముక్కు, నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్త పడాలి. రోజులో ఎక్కువసార్లు 15 నుంచి 20 సెకన్లపాటు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

ఇవీ చూడండి:నిర్బంధంలో 11 మంది కరోనా అనుమానితులు

ABOUT THE AUTHOR

...view details