జంటనగరాల్లో కరోనా కలకలం కొనసాగుతోంది. రాష్ట్రంలో నమోదవుతోన్న మొత్తం కేసుల్లో 90 శాతం ఇక్కడే వస్తున్నందున ప్రభుత్వ యంత్రాంగం కట్టడి చర్యల్లో నిమగ్నమైంది. ఇప్పటివరకు 14, 419 కేసులు నమోదుకాగా.. జీహెచ్ఎంసీ పరిధిలోనే 10,666 కేసులు లెక్క తేలాయి. సోమవారం రాజధానిలో భారీగానే కొత్తకేసులొచ్చాయి.
హోం మంత్రి మహమూద్ అలీ, ఆయన మనుమడికి కరోనా సోకింది. అర్ధరాత్రి వారిద్దరిని జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మంత్రి పెషీ, ఇంటిని జీహెచ్ఎంసీ సిబ్బంది శానిటైజ్ చేశారు. పెషీలోని మిగతా కార్యాలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కూకట్‌పల్లిలోని రామ్ దేవ్ రావు హాస్పిటల్‌లో పనిచేస్తున్న 17 మంది నర్సులు, ఆయాలకు కరోనా వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. యూసుఫ్ గూడ సర్కిల్ పరిధిలో సోమవారం 26 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధదరణ అయింది.
అంబర్ పేట్ నియోజక వర్గ పరిధిలో జూన్ 29న... 65 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త నల్లకుంట పరిధిలో కరోనా బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. సోమవారం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అధికంగా అంబర్‌పేట్ డివిజన్‌లో 34, కాచిగూడ డివిజన్ పరిధిలో 14, గోల్నాక డివిజన్ పరిధిలో 3, నల్లకుంట 13, బాగ్ అంబర్‌పేట్ పరిధిలో ఒక కేసు నమోదయ్యాయి.