పల్లెలను కబళిస్తున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో మరణమృదంగం మోగిస్తున్న కరోనా మహమ్మారి నిత్యం ఎందరినో బలితీసుకుంటోంది. ఇదిగో ఇక్కడ చూస్తున్నారుగా... కుర్చీలో కూర్చున్న వ్యక్తిని. 4 రోజుల క్రితం కరోనా నిర్ధరణ కావటంతో... హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఆరోగ్యం కొంచెం క్షీణించినట్లుగా అనుమానం రావటంతో... అంబులెన్స్‌కు ఫోన్‌చేశాడు. అది వచ్చేలోగా ఇలా కూర్చులోనే ప్రాణాలు విడిచాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. ఆత్మకూరు మండలం రహీంఖాన్‌పేటకు చెందిన అన్నెపురం పవన్ కుమార్ ఆటోడ్రైవర్‌గా జీవనం గడుపుతున్నాడు. గతేడాది అనారోగ్యంతో తండ్రి చనిపోగా తల్లితో ఉంటున్నాడు. 4 రోజుల క్రితం కొవిడ్ నిర్ధరణ కావడంతో హోంఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి ఆరోగ్యం క్షీణించడంతో 108 కాల్ చేయగా... ఆ వాహనం వచ్చేసరికి చనిపోయాడు. అతను కరోనాతో మృతి చెందడంతో బంధువులు ఎవ్వరూ రాకపోవడంతో గ్రామ పంచాయతీ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించారు.
ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో 15 రోజుల వ్యవధిలో 9 మంది మృతి చెందటం... పల్లెలపై కరోనా పడగ విప్పిన తీరును ప్రతిబింబిస్తోంది. మొదట వరసగా ఇద్దరి మరణాలతో గ్రామంలో టెస్టులు జరపగా... 90 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఈ క్రమంలోనే... ప్రతి రెండ్రోజులకొకరు చొప్పున ఇప్పటికే 9మంది వరసగా చనిపోవటంతో గ్రామస్థులను ఉలిక్కిపడేలా చేసింది. నిన్న విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు కృష్ణారెడ్డి, యశోద మరణించటంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది.
తండ్రికొడుకుల మృతి
నారాయణపేట జిల్లా ధన్వాడలో మూడ్రోజుల వ్యవధిలోనే తండ్రి కొడుకును రాకాసి బలితీసుకుంది. సుంకు రాజయ్య కుటుంబం ఇటీవల కరోనా బారిన పడింది. ఇంట్లో వారందరూ హోంక్వారంటైన్‌లో ఉండగా... రాజయ్య కుమారుడు చందు ఆరోగ్యం క్షీణించింది. దీంతో మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ ఈ నెల7న మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఆఖరి చూపుకైనా నోచుకోకుండా చందు అంతిమ సంస్కారాలు జరిగాయి. అనంతరం, నిన్న అస్వస్థతకు గురైన రాజయ్యను ఆస్పత్రికి తరలించగానే ప్రాణాలు కోల్పోయాడు.
భయంతో ఆత్మహత్యలు
మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఒకే రోజు తండ్రికొడుకు ప్రాణాలు కోల్పోయారు. పడాలపల్లి గ్రామంలో కానుకుంట యాదయ్య అనారోగ్యంతో బాధపడుతూ నిన్న ఉదయం ఇంట్లోనే మృతి చెందారు. శ్వాసకోస సంబంధిత సమస్యతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కుమారుడు కృష్ణ సైతం తండ్రి మరణించిన గంట తర్వాత మృతి చెందాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్రవిషాదాన్ని నింపింది. హైదరాబాద్ చింతల్ పరిధిలోని గణేశ్‌నగర్ కల్పన సొసైటీలో ఉండే ఆదినారాయణ కుటుంబానికి కరోనా సోకింది. దీంతో ఆయనతో పాటు భార్య కనకదుర్గ, కుమారుడు నవీన్ హోంఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఆదినారాయణ పరిస్థితి విషమించి చనిపోయాడు. విషయం తెలుసుకున్న భార్య కనకదుర్గ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అంత్యక్రియలకు రాని బంధువులు
సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి గునుగుంట్ల నవీన్ కరోనా బారిన పడ్డాడు. హోంఐసోలేషన్‌లోనే ఉంటున్న ఆయన... నిన్న ఉదయపు నడకకు వెళ్లి, చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం గడిమున్కన్‌పల్లిలో కరోనా సోకటంతో ఆందోళనకు గురైన ఉలిగుండం నర్సప్ప అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని జాంపెద్దూరులో గంగవ్వ అనే అనే మహిళ నిన్న మరణించింది. కరోనాతో మరణించిందనే అనుమానంతో బంధువులెవరూ అంత్యక్రియలకు ముందుకు రాకపోవటంతో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు దహనసంస్కారాలు నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కోడెర్ మండలం నాగులపల్లిలో కరోనా సోకి మరణించిన వ్యక్తి అంత్యక్రియలను గ్రామపంచాయతీ సిబ్బంది నిర్వహించారు.
టెస్ట్ కిట్లు, వ్యాక్సిన్ల కొరత
రాష్ట్రవ్యాప్తంగా ఇవే కాదు... వెలుగులోకి రాని ఎన్నో ఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. కుటుంబాలకు కుటుంబాలను విషాదంలోకి నెట్టేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి... ప్రభుత్వం చెబుతున్న కరోనా లెక్కలకు ఎక్కడా పొంతన కనిపించటంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రికి వెళ్తే సౌకర్యాలు ఉండవు. ప్రైవేటు వెళ్లే స్థోమత ఉండదు. చేసేదిలేక దేవుడిపై భారం వేసే పరిస్థితి నెలకొంది. వైరస్ సోకిందనే అనుమానంతో పరీక్షలకు, ముందస్తు జాగ్రత్తగా వ్యాక్సిన్ కేంద్రాలకు జనం పరుగులు తీస్తున్నా... టెస్టు కిట్‌లు, టీకా నిల్వలు అందుబాటులో లేక నిరాశే ఎదురవుతోందని బాధితులు వాపోతున్నారు.
ఇదీ చదవండి:తెరాస కార్యకర్త ఆవేదన.. బాల్కసుమన్కు సెల్పీ వీడియోతో విజ్ఞప్తి