రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలకు ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని ప్రజారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. విలువైన ఇంజెక్షన్లు జిల్లా స్థాయి వరకు అందుబాటులో ఉంచామన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పడకలు కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. కరోనా రోగులు త్వరగా కోలుకునే విధంగా ప్రభుత్వం ధైర్యం కల్పిస్తోందన్నారు.
మరణాల శాతం తగ్గింది
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు పెరిగిందని అన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల శాతం తగ్గిందని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ వస్తే 14 రోజులకు మందుల కిట్ అందజేస్తున్నామని.. ఐసోలేషన్ సౌకర్యం లేనివారికి కొవిడ్ కేర్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆగస్టు నెలాఖరుకల్లా జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సెప్టెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ నివారణ చర్యలతో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందన్నారు. జిల్లాలోని ఆస్పత్రుల్లో సైతం కరోనా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అన్ని వైద్య కళాశాలల అనుబంధ ఆస్పత్రుల్లో చికిత్సకు ఏర్పాట్లు చేశామన్నారు.