కొత్త సచివాలయ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా వేగవంతం చేసింది. కీలకమైన పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యింది. సచివాలయ భవన సముదాయం కోసం మొత్తం 194 భారీ పిల్లర్లు నిర్మించారు. ఒక్కో పిల్లర్‌కు ఓ రెండు పడకల గదుల ఇంటికి అయ్యేంత సిమెంట్, ఇసుక, కాంక్రీట్ మిశ్రమం పట్టింది. రోజూ రెండు షిఫ్టుల్లో, అవసరమైనప్పుడు మూడు షిఫ్టుల్లో పనులు జరిగాయి. పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యాక గ్రౌండ్ ఫ్లోర్ రూఫ్‌కు సంబంధించిన పనులను ప్రారంభించారు. స్లాబ్ వేసేందుకు అనువుగా అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. అయితే కరోనా రెండో వేవ్ ప్రభావం ఈ పనులపై బాగా పడింది.
కార్మికులతో పాటు
సచివాలయ నిర్మాణంలో దాదాపుగా 2000కు పైగా కార్మికులు ఉన్నారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వర్కర్స్ షెడ్స్ లో వారు ఉంటున్నారు. అయితే కార్మికుల్లో చాలా మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. అధికారులు ముందస్తుగానే కార్మికులకు ఒక డోసు టీకాలు కూడా ఇప్పించారు. అయినప్పటికీ పలువురికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. వారందరినీ అక్కడే ఐసోలేషన్‌లో ఉంచుతున్నారు. అందులో కొందరు కోలుకున్నారు. కార్మికులతో పాటు ఆర్ అండ్ బీ ఇంజినీర్లు, గుత్తేదారు కంపెనీ తరపు ఇంజినీర్లలో కూడా కొందరికి కరోనా వచ్చింది. దీంతో ఆ ప్రభావం సచివాలయ నిర్మాణ పనులపై పడింది.