దేశవ్యాప్తంగా అన్లాక్ ప్రారంభమైనా.. సాధారణ రైళ్లు మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు. కరోనాతో మార్చి 22న నిలిచిపోయిన రైళ్లు.. ఇప్పటికి పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు. దసరా, దీపావళి పండగలకు అయిన పూర్తి స్థాయిలో రైళ్లు నడుస్థాయని అశించినవారికి నిరాశే మిగిలింది. సరిపడ రైళ్లు లేక.. రైల్వే స్టేషన్లకు వచ్చే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో నిరంతరం ప్రయాణికులతో కళకళ లాడే రైల్వే స్టేషన్ల ప్లాట్ ఫాంలు వెలవెలబోతున్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే స్టేషన్ పరిసర ప్రాంతాలు బోసిపోయాయి. స్టేషన్లలో వ్యాపారాలు లేక దుకాణాలు మూతపడ్టాయి. ప్రయాణికులనే నమ్ముకుని జీవనం సాగించే వీరికి ఉపాధి కరవైంది.
కరోనాకు ముందు సాధారణ రోజుల్లో ఏపీ విజయవాడ రైల్వే స్టేషన్లో రోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండేవారు. భారీగా సరకు రవాణా జరుగుతుండేది. దీంతో ప్రయాణికుల లగేజీని రైలు ఎక్కించేందుకు, దించేందుకు లైసెన్స్ కల్గిన కూలీలను రైల్వే శాఖ నియమించింది. లగేజీ మోయగా వచ్చే కొద్దిపాటి కూలీతో వీరి జీవనం సాఫీగా గడిచిపోయేది. అయితే కరోనా రాకతో ప్రారంభమైన వీరి కష్టాలు నేటికి తీరడం లేదు. ఒకప్పుడు చేతి నిండా పనితో ఉండే వీరు.. ఇప్పడు మూడు రోజులకు ఒకసారి మాత్రమే పని దొరుకుతోంది. ఆరోజంతా పని చేస్తే మూడు వందలు కూడా రావడం గగనమైపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా భయంతో చాలా మంది ప్రయాణికులు కూలీలకు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు చెబుతున్నారు. రైల్వే అధికారులు కూడా ఎక్కువ లగేజీని అనుమతించకపోవడంతో కూలీల ఉపాధికి గండి పడుతోందని వాపోతున్నారు. గతంలో ఎక్కువ కాలం రైల్వే కూలీగా పనిచేసిన వారిని గ్యాంగ్ మెన్లుగా నియమించేవారని.. కొన్నేళ్లుగా దాన్ని అమలు చేయడం లేదంటున్నారు. ఉపాధి లేక కష్టాలు పడుతోన్న తమకు గ్యాంగ్ మెన్లుగా నైనా అవకాశం కల్పించాలని వీరు కోరుతున్నారు.