ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యువతే కీలకం. ఈ క్రమంలో ప్రస్తుతం కొవిడ్-19 వైరస్‌ను జయించేందుకు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం సహా వయసుతో నిమిత్తం లేకుండా యోగా, వ్యాయామం చేస్తున్నారు. ఆగస్ట్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాయామశాలలు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ వ్యాయామశాలలు తెరుకున్నాయి. వ్యాయామశాలలకు వచ్చే వారి చేతులకు శానిటైజేషన్ చేయడంతో పాటు, థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను సైతం నిర్వహిస్తున్నారు.
ఎక్కడ కరోనా సోకుతుందోనని...
అయినప్పటికీ.. వ్యాయామశాలలకు వెళ్తే... ఎక్కడ కరోనా సోకుతుందో అని చాలా మంది భయపడిపోతున్నారు. ఫలితంగా జిమ్‌లు తెరిచినప్పటికీ... వెలవెలాబోతున్నాయని నిర్వహకులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వ్యాయామశాలలకు వచ్చే వారితో పోల్చితే... ప్రస్తుతం కేవలం 20శాతం మంది మాత్రమే వస్తున్నారని పేర్కొంటున్నారు. కరోనా నేపథ్యంలో ఒకరు ముట్టుకున్న వస్తువులను మరొకరు పట్టుకోవాలంటేనే జంకుతున్నారు.
సుమారు 40వేల మందికి ఉపాధి..
గ్రేటర్ పరిధిలో సుమారు 10వేల వరకు వ్యాయామశాలలు ఉన్నాయి. వీటిపై ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 40వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. కోచ్‌లు, ట్రైనర్లు, కొన్ని పెద్ద జిమ్‌లలో హెచ్ఆర్ కూడా ఉంటారు. ఈ జిమ్‌లు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. బల్దియా పరిధిలో ఇటువంటివి సుమారు 10 నుంచి 15 వరకు ఉంటాయని వ్యాయామశాలల నిర్వాహకులు చెప్పుకొచ్చారు.
వారికి అందుబాటులో వెయ్యి జిమ్‌లు...
మధ్య తరగతి వారికీ సుమారు వెయ్యికిపైగా జిమ్‌లు అందుబాటులో ఉన్నాయని... మిగిలిన జిమ్‌లు కొంత తక్కువ ధరలోనే ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వచ్చేవారిలో భయం మాత్రం పోవడంలేదని నిర్వాహకులు అంటున్నారు. ప్రతి గంటకొకసారి తమ జిమ్‌ను శానిటైజేషన్ చేస్తున్నామని.. వస్తువులను కూడా శానిటైజేషన్ చేస్తున్నా.. వ్యాయామం చేసేందుకు తక్కువ సంఖ్యలోనే వస్తున్నారని వాపోతున్నారు. ఫలితంగా అద్దెలు కట్టడం భారమైపోతుందని స్పష్టం చేశారు. దీనికితోడు శానిటైజేషన్ నిర్వహణ ఖర్చులు అదనపు భారంగా మారిపోయాయంటున్నారు.
ఇంట్లో వ్యాయామానికే ఆసక్తి...