కరోనా దెబ్బ.. తలకోన పర్యాటకం కుదేలు మండే ఎండాకాలం సైతం అక్కడ చల్లటి గాలులు మైమరపింపజేస్తాయి. వర్షాకాలం కొండలపై నుంచి జాలువారే జలపాతాలు మనస్సుకు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. పచ్చటి ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన తలకోన అటవీ ప్రాంతం.. పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఏపీ చిత్తూరు జిల్లా ఎర్రావారి పాలెం మండలంలోని శేషాచలం కొండల్లో విస్తరించిన ఈ దట్టమైన అడవి ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. పక్షుల కిలకిలరావాలు.. జలజలపారే సెలయేటి చప్పుళ్లకు తోడు..పర్యాటకులతో ఎప్పుడూ సందడిగా ఉండే తలకోన కరోనా మహమ్మారి దెబ్బకు వెలవెలబోతోంది.
సముద్ర మట్టానికి ఎత్తున...శేషాచల అడవి గుట్టలపై ఏర్పడిన ఈ కోనలో ఉండే విభిన్న పరిస్థితులే పెద్దఎత్తున పర్యావరణ, ప్రకృతి ప్రేమికులు తరలివచ్చేలా చేస్తుంటాయి. ఇక వానాకాలం వచ్చిందంటే చాలు... అక్కడి ప్రకృతి అందాలు మరింత శోభను సంతరించుకుంటాయి. అలాంటిది కరోనా మహమ్మారి ప్రభావంతో ఇప్పుడు అక్కడంతా నిర్మానుష్యం రాజ్యమేలుతోంది. పర్యాటకులు లేక ఆ ప్రాంతాలన్నీ వెలవెలబోతున్నాయి.
వర్షాకాలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తూ కనువిందు చేసే ఈ జలపాతం అందాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. కొవిడ్ నిబంధనల కారణంగా పర్యాటక ప్రాంతాలకు అనుమతి లేకపోవడం వల్ల 4 నెలలుగా తలకోన అటవీ ప్రాంతం మొత్తం మూతపడింది. ఇక్కడికి వచ్చే పర్యాటకులపై ఆధారపడి ఉన్న ఆతిథ్య రంగం సైతం పూర్తిగా కుదేలైంది.
ఈ అడవిని, జలపాతాన్ని నమ్ముకున్న గిరిపుత్రుల కోసం ఇక్కడి అటవీశాఖాధికారులు కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం- సీబీఈటీ పేరుతో ఓ సొసైటీని ఏర్పాటు చేసి ఉపాధి కల్పించారు. వచ్చే పర్యాటకుల కోసం అతిథి గృహాలు నిర్వహించటం దగ్గర నుంచి వారికి భోజన సదుపాయాలు, గేట్ నిర్వహణ, జలపాత పరిరక్షణ ఇలా పలు విభాగాల్లో దాదాపు 20 కుటుంబాలు తలకోన పర్యాటకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వీరంతా అటవీ ప్రాంత పరిసర గ్రామాల్లోని పేద ప్రజలే. ఇక్కడి పర్యాటకంపై వచ్చే ఆదాయంతోనే వీరందరికీ జీతాలు, అతిథి గృహాల నిర్వహణ తదితర కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. అలాంటిది నాలుగు నెలల నుంచి పర్యాటకులు లేకపోవటం వల్ల ఆదాయం కోల్పోయి వీరంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి:ఏ చావైనా.. కొవిడ్ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల