తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కలవర పెడుతోంది.. చిరువ్యాపారం చితికిపోతోంది

కరోనా మహమ్మారి పలు రంగాలను కోలుకోలేని దెబ్బ తీసింది. ఏ టైంలో అయినా.. ఫుడ్ ఇండస్ట్రీకి డోకా ఉండదనుకుంటారు. కానీ కొవిడ్​-19 కారణంగా ఆహార, ఆతిథ్య రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పదేళ్లుగా హైదరాబాద్ నగరంలోఫాస్ట్ ఫుడ్ నిర్వహిస్తోన్న ఒడిశాకు చెందిన ఓ నిర్వాహకుడు.. లాక్​డౌన్​తో వ్యాపారం పూర్తిగా దెబ్బతిని సొంత రాష్ట్రానికి పయనమయ్యే దీనస్థితికి చేరుకున్నాడంటే... పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు.

Hyderabad Business decrease  latest news
Hyderabad latest neHyderabad Business decrease latest newsws

By

Published : Jun 13, 2020, 8:14 PM IST

ఎంతో మందికి ఉపాధి కల్పించిన భాగ్యనగరం.. నేడు పెరుగుతోన్న కొవిడ్-19 కేసులకు అడ్డాగా మారింది. పదేళ్ల క్రితం పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్​కు చేరుకున్న ఒడిశాకు చెందిన ముక్తార్​ను భాగ్యనగరం అక్కున చేర్చుకుంది. హైదరాబాద్ సోమాజిగూడలో ఫాస్ట్ ఫుడ్ నిర్వహిస్తోన్న ముక్తార్ వ్యాపారం... కరోనా మహమ్మారికి ముందు బాగా నడిచేది. రోజుకు 6 నుంచి 7 వేల రూపాయల వ్యాపారం జరిగేది. వ్యాపారం బాగా సాగటంతో నెలకు 25 వేల దుకాణ అద్దె చెల్లిస్తూ.. ఒడిశా నుంచి ఓ మాస్టర్ చెఫ్​ను కూడా తెచ్చుకున్నాడు. కొవిడ్-19 దెబ్బకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది.

జనం బయట తినేందుకు జంకుతున్నారు...

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో రెండు నెలల పాటు.. వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది. సడలింపుల్లో భాగంగా ఎంతో ఆశగా తిరిగి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తెరిచినా.. ఆశించిన స్థాయిలో వ్యాపారం జరగక ఆందోళన చెందుతున్నాడు. కొవిడ్​-19 భయంతో జనం బయట తినేందుకు జంకుతున్నారని పేర్కొన్నారు. రోజూ మూడు, నాలుగు ప్లేట్​లకు మించి అమ్ముడు పోవడం లేదని.. ఎంత వండాలో, ఎంత పోతుందో తెలియని పరిస్థితి అని వాపోయాడు.

స్వరాష్ట్రం వెళ్లి ఏదైనా ఉపాధి చూసుకుంటా...

నూడుల్స్, మంచురియా ఉడికించి.. ఆర్డర్ కోసం ఎవరైనా రాకపోతారా అని నిరీక్షిస్తున్నామని ముక్తార్ తెలిపారు. మూడు నెలలకు సంబంధించిన షాపు అద్దె రూ.75 వేలు చెల్లించాలని.. తన వద్ద పనిచేసే ఉద్యోగికి వేతనం చెల్లిచలేని పరిస్థితికి దిగజారానని వాపోయాడు. అప్పులు చేసి షాప్ నిర్వహిస్తున్నానని.. తిరిగి స్వరాష్ట్రం వెళ్లి ఏదైనా ఉపాధి చూసుకుంటానని తన దీనావస్థను వెళ్లగక్కాడు.

పది ప్లేట్లు కూడా అమ్మే పరిస్థితి లేదు...

రోజూ ఆర్డర్ కోసం అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవడం, ఎవరూ రాకపోవడం వల్ల రాత్రికి పడేయడం జరుగుతోందని చెఫ్ తెలిపాడు. ఉపాధికోసం నగరానికి వచ్చానని.. కానీ నా యజమాని వ్యాపారం సరిగా నడవకపోవడం వల్ల ఆయన జీతం ఇవ్వట్లేదని చెఫ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడే రెండుపూటలు భోజనం చేసి పొట్ట నింపుకుంటున్నానని పేర్కొన్నాడు. ఒకప్పుడు వంద ప్లేట్లకు పైగా అమ్మిన చేతులు... ఇప్పుడు పది ప్లేట్లు కూడా అమ్మే పరిస్థితి లేదన్నాడు.

నలుగురి ఆకలి తీర్చి, నాలుగు రాళ్లు సంపాదించుకుందామని నగరానికి వచ్చిన చిరువ్యాపారులను తిరిగి సొంత గూటికి పయనమయ్యేలా కరోనా మార్చేసింది.

ABOUT THE AUTHOR

...view details