తెలంగాణ

telangana

ETV Bharat / state

సచివాలయంపై కరోనా ప్రభావం.. ఉద్యోగుల్లో భయం భయం.. - corona cases in telangana secretariat

సచివాలయంపై కరోనా ప్రభావం పడింది. కొందరు ఉద్యోగులు కొవిడ్ బారిన పడడంతో సంబంధిత శాఖల కార్యాలయాలు మూతపడ్డాయి. మిగతా శాఖల్లోనూ తక్కువ మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. సందర్శకులకు అనుమతి నిరాకరించారు.

corona
corona

By

Published : Jun 13, 2020, 12:40 PM IST

రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ప్రభావం అన్ని చోట్లా స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర పాలనా వ్యవహారాలకు కేంద్రమైన సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బూర్గుల రామకృష్ణారావు భవన్​లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆర్థికశాఖలో పొరుగుసేవల విధానంలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ శాఖలోని ఉద్యోగులు ఎవరూ కార్యాలయానికి రావడం లేదు. ఆర్థికశాఖ కార్యదర్శులు రొనాల్డ్ రోస్, శ్రీదేవి హోంక్వారంటైన్ లోకి వెళ్లగా ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఎప్పట్నుంచో ఇంటివద్ద నుంచి, సీజీజీ నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా ఉద్యోగులు సైతం అత్యవసరమైతేనే కార్యాలయానికి వస్తున్నారు.

ఇరుకుగా ఉండటంతో

మహిళా, శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కుమారునికి కూడా పాజిటివ్ రావాడంతో సదరు ఉద్యోగితో పాటు ఆ విభాగంలోని వారు కూడా ఇంటివద్దే ఉంటున్నారు. మిగతా శాఖలు, విభాగాల్లోనూ చాలా మంది ఉద్యోగులు విధులకు రావడం లేదు. కనీస సిబ్బంది ఉండేలా సర్దుబాటు చేసుకుంటున్నారు. కనీస సిబ్బందితో కార్యకలాపాలు కొనసాగించాలని అధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేనప్పటికీ మౌఖిక ఆదేశాలు అందినట్లు ఉద్యోగులు చెప్తున్నారు. బీఆర్కే భవన్ ఇరుకుగా ఉండడం, ఉద్యోగులు అందరూ దగ్గర దగ్గరగా కూర్చొని విధులు నిర్వర్తించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందికరమని అంటున్నారు.

సందర్శకులకు అనుమతి లేదు

బీఆర్కే భవన్​లోకి సందర్శకులను కూడా అనుమతించడం లేదు. అత్యవసర పనులపై వచ్చే వారైతే సంబంధిత అధికారుల అనుమతితోనే లోపలికి పంపిస్తున్నారు. అధికారులు కూడా వీలైనంత మేరకు ఎవరికీ అపాయింట్​మెంట్లు ఇవ్వడం లేదు. భద్రతా విధులు నిర్వర్తిస్తోన్న ఎస్పీఎఫ్ సిబ్బంది కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర కార్యాలయాల వద్ద విధులు నిర్వర్తిస్తున్న కొంత మంది ఎస్పీఎఫ్ సిబ్బంది కొవిడ్ బారిన పడడంతో పూర్తి అప్రమత్తంగా ఉంటున్నారు. ముందు జాగ్రత్తగా కొంత మంది ఎస్పీఎఫ్ సిబ్బందికి కరోనా పరీక్షలు కూడా చేయించారు. బీఆర్కే భవన్ ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్కానర్ కెమెరాలతో పరీక్షించాకే ఉద్యోగులను లోపలికి అనుమతిస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది తరుచుగా రసాయనాలను పిచికారీ చేస్తున్నారు.

ఇదీ చదవండి:సచివాలయంలో కరోనా కలకలం

ABOUT THE AUTHOR

...view details