భాగ్యనగరంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జూన్ 1 వరకు 1,600కుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్‌కు చెందిన 64 మంది వృద్ధులు చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. 900 మందికిపైగా వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 650 యాక్టివ్ పాజిటివ్ కేసులు ఉన్నాయని గణాంకాలు చెబుతుండగా అందులో 518 మంది రాజధానికి చెందిన వారని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. మిగిలిన వారంతా లాక్‌డౌన్ సమయంలో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చినవారు.
మరణాలకు కారణాలివీ..
వైరస్ సోకినా యుక్త వయసులో ఉన్నవారు త్వరగా కోలుకుంటున్నారని, వృద్ధుల విషయంలోనే నష్టం జరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, ఇటీవలే బైపాస్ సర్జరీలు చేసుకున్నవారు, అల్సర్, ఆస్తమా, ఇతర రుగ్మతలతో బాధపడుతోన్న వృద్ధులు మృత్యువాత పడుతున్నారని తెలిపారు. వారిలో వ్యాధి నిరోధకశక్తి చాలా తక్కువగా ఉండటంతో మరణాల రేటు ఎక్కువగా ఉంటోందన్నారు. ‘మూత్రపిండాల సమస్య ఉన్నవారు తరచూ డయాలసిస్ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ సమయంలో వైరస్ పంజా విసురుతోంది. సూక్ష్మక్రిమి మూత్రపిండాలతోపాటు శరీర భాగాలన్నింటినీ ప్రభావితం చేస్తోంది. గుండెకు, మెదడుకు ప్రాణవాయువు అందక మరణాలు సంభవిస్తున్నాయి. అలాగని అందరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇతర రుగ్మతలున్న పలువురు వృద్ధులు వైరస్‌ను జయిస్తున్నారు’ అని వైద్యులు చెబుతున్నారు.