తెలంగాణ

telangana

By

Published : Jun 23, 2021, 6:54 AM IST

ETV Bharat / state

Corona Effect: కొత్త పరిశ్రమలకు తప్పని ఇబ్బందులు.. యంత్రాల కోసం ఎదురుచూపులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలోని కొత్త పరిశ్రమలకు శాపంగా మారింది. సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌) రూపొందించుకొని... సొంత పెట్టుబడులతో పాటు బ్యాంకర్ల నుంచి రుణహామీ పొంది, యంత్రాల దిగుమతులకు సిద్ధమైన పారిశ్రామిక సంస్థల పరిస్థితి తారుమారైంది.

corona-effect-on-new-industries-in-telangana
Corona Effect: కొత్తపరిశ్రమలకు తప్పని ఇబ్బందులు.. యంత్రాల కోసం ఎదురుచూపులు

2015లో టీఎస్‌ఐపాస్‌ ప్రారంభమయ్యాక రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వెల్లువెత్తాయి. కొత్త పరిశ్రమల స్థాపనకు 37,631 సంస్థలు, మరికొన్ని తమ సంస్థల విస్తరణకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో అన్ని రకాల అనుమతులు ఉన్న 30,597 సంస్థలకు ప్రాథమికంగా పరిశ్రమలను స్థాపన(CFE)కు అనుమతి లభించింది. వాటిల్లో అన్ని రకాలుగా సిద్ధమైన 15,852 సంస్థలకు కార్యకలాపాలను ప్రారంభించేందుకు (CFO) తుది అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. మొదటి అయిదేళ్లలో 8 వేల పరిశ్రమలు కార్యకలాపాలను ప్రారంభించాయి. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు మరో 4,198 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. కానీ గత రెండేళ్ల వ్యవధిలో అనుమతులు పొందిన మరో 3654 పరిశ్రమలు ఇంకా పట్టాలెక్కలేదు.

ముసురుకున్న ఆర్థిక సమస్యలు

పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలు దానికి సంబంధించిన ముందస్తు ప్రణాళిక రూపొందించుకుంటారు. పెట్టుబడులపై సమీకరణపై ఒక అంచనాకు వస్తారు. ముందుగా భూములు కొంటారు. డీపీఆర్‌ ఆధారంగా తమ సన్నద్ధత అనంతరం టీఎస్‌ఐపాస్‌లో దరఖాస్తు చేసుకుంటారు. ప్రభుత్వ అనుమతుల తర్వాత వారు సొంతంగా పెట్టుబడులు సమీకరిస్తే వెంటనే నిర్మాణాలు ప్రారంభించి, ఏడాది కాలంలో ఉత్పత్తులకు పూనుకుంటున్నారు. మిగిలిన సంస్థలు పెట్టుబడుల కోసం భాగస్వామ్య పక్షాలను, బ్యాంకులను సంప్రదిస్తున్నాయి. కరోనాకు ముందు టీఎస్‌ఐపాస్‌(TS I-PASS) ద్వారా అనుమతులు పొందిన పరిశ్రమలకు వెనువెంటనే రుణ సాయం అందించేవి. 2020 మార్చి నుంచి బ్యాంకుల వైఖరిలో కొంత మార్పు వచ్చింది. పరిశ్రమలకు రుణసాయం సత్వరం అందించడం లేదు. గతేడాది దరఖాస్తు చేసుకున్న వాటిలో 40 శాతం పారిశ్రామిక సంస్థలకే రుణాలు అందాయి. కరోనాకు ముందు పరిశ్రమల్లో భాగస్వాములయ్యేందుకు వచ్చిన సంస్థలు ఆ తర్వాత పరిస్థితులను చూసి వెనుకంజ వేస్తున్నాయి. దీంతో అనుమతులు పొందిన 420 సంస్థలు మరో భాగస్వామి కోసం వేటలో ఉన్నాయి.

సమస్యలు తొలగిపోతాయి

గత రెండేళ్ల వ్యవధిలో దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలన్నీ ప్రారంభమవుతాయని విశ్వసిస్తున్నాం. 3654లలో కొన్ని ప్రారంభదశలో ఉన్నాయి. మరికొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్తలకు వాటిని అధిగమించేందుకు ప్రభుత్వపరంగా సాయం అందిస్తున్నాం. అనుమతులు పొందాక పరిశ్రమలను ప్రారంభించడానికి రెండేళ్ల సమయం ఉంది. కరోనా ప్రభావం తగ్గితే నిర్ణీత గడువు మేరకే అవి ఉత్పత్తులు చేపట్టవచ్చు.

- జయేశ్‌రంజన్‌, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి

విదేశాల్లో నిలిచిన యంత్ర పరికరాలు

2020 ఫిబ్రవరికి ముందు అనుమతులు పొందిన సంస్థల్లో 290 భవన నిర్మాణాలు పూర్తి చేసుకొన్నాయి. ఫ్యాక్టరీకి అవసరమైన యంత్ర పరికరాల కోసం జర్మనీ, జపాన్‌, చైనా, బెల్జియం తదితర దేశాల్లోని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చాయి. ఆ ఏడాది మార్చి తర్వాత అవి చేరాల్సి ఉండగా.. కరోనా ఆంక్షలు అమలులోకి రావడంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా దేశాల నుంచి యంత్ర పరికరాలు రాలేదు. ఈ ఏడాది ఆగస్టు తర్వాత సడలింపులతో మరో 140 సంస్థలు దరఖాస్తు చేసుకోగా.. వాటికి ఇంకా యంత్రాలు రాలేదు. భారత్‌లో సడలింపులున్నా.. ఇతర దేశాల్లో ఆంక్షలు కొనసాగడం వల్ల అవి ఎప్పుడు అందుతాయోనన్న ఆందోళన నెలకొందని పారిశ్రామికవేత్త శ్రీనివాస్‌ వాపోయారు.

ఇదీ చూడండి:ఖాదీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్టాన్‌ భూముల అమ్మకం!

ABOUT THE AUTHOR

...view details