* అంబర్‌పేటకు చెందిన దంపతులు కుమారుడికి వివాహం చేయడానికి మే 3న ముహూర్తం నిర్ణయించారు. భారీగా రిసెప్షన్ చేయాలనుకున్నారు. ఎర్రగడ్డ వద్ద ఓ ఫంక్షన్ హాల్‌ను బుక్ చేసుకున్నారు. కరోనా విజృంభిస్తుండటంతో చివరకు రిసెప్షన్ రద్దు చేసుకుని...అతి తక్కువ మంది బంధువుల మధ్య గుడి లేదా రిజిస్టర్ పెళ్లి జరిపిద్దామని నిర్ణయించారు.
* బంజారాహిల్స్‌లో ఉంటున్న దంపతులు తమ కుమార్తె పెళ్లిని సొంతూరులో భారీ ఎత్తున జరిపేందుకు నిర్ణయించారు. ప్రత్యేక బస్సులు మాట్లాడారు. భారీగా వస్తున్న కరోనా కేసులతో ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. పరిస్థితి చేయి దాటితే బంధువులు కుటుంబ సభ్యుల మధ్య చేయాలని భావిస్తున్నారు.
కానీ ఇప్పుడు పరిస్థితి చేదాటి పోతుంది. కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో పెళ్లి, విందు అంటే జన సమూహం చేరుతుంది. ఒక్కరికి కరోనా ఉన్నా... ఎందరినో చుట్టేయడం ఖాయం. ఈ నేపథ్యంలో చాలామంది పునరాలోచనలో పడుతున్నారు. కొందరు పెళ్లి ఎలాగోలా జరిపించేసి విందును రద్దు చేసుకోవాలని భావిస్తున్నారు. కొందరైతే పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు. మరికొందరు అదే ముహూర్తాలకు నిరాడంబరంగా రిజిస్టర్ మ్యారేజ్ చేయించి.. పరిస్థితి కుదుటపడ్డాక విందు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. మరికొందరు ఇరువైపులా వృద్ధులను వేడుకకు దూరంగా ఉంచి.. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివాహం చూసేలా ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
* కొవిడ్‌ను చాలామంది ఇంకా సీరియస్‌గా తీసుకోవడం లేదు. వచ్చే నెల రోజుల్లో పెళ్లిళ్లు ఎక్కువ సంఖ్యలో జరగనున్నాయి. అలా అయితే..మరింతగా విజృంభించే అవకాశం ఉంది.
* పెళ్లి విందు వద్ద తినే సమయంలో మాస్క్ తీయాల్సి ఉంటుంది. పక్క రాష్ట్రాల నుంచి కూడా వివాహాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. దీంతో వైరస్ వ్యాప్తి బాగా పెరిగే అవకాశం ఉంది.
* దిల్లీలో ఒక పెళ్లిలో 40 మందికి కరోనా సోకింది. ఇందులో పలువురి ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. కాబట్టి పెళ్లిళ్లలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి.