వేసవిలో ముహూర్తాలు ఉన్నప్పటికీ.. కొవిడ్ ప్రభావంతో చాలా మంది వివాహాలు వాయిదా వేసుకున్నారు. శ్రావణ మాసంలో మంచి ముహుర్తాలు ఉంటాయని.. ఆలోగా కరోనా కూడా కాస్త తగ్గుముఖం పడుతుందని భావించారు. అయితే కొవిడ్ కేసులు తగ్గకపోగా మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులిస్తోంది. దీంతో కొందరు పెళ్లిళ్లను వాయిదా వేసుకోగా.. ఇక చేసుకునేవారు సైతం ఎలాంటి ఆర్భాటం లేకుండా కుటుంబసభ్యుల మధ్యే వివాహాలు కానిచ్చేస్తున్నారు. ఈ పరిస్థితులతో బాజాభజంత్రీలు, పంతుళ్లు, వీడీయో గ్రాఫర్లు, ఫొటో గ్రాఫర్లు, పెళ్లి పత్రికలు, డెకరేషన్, టెంట్‌హౌస్ ఇలా అనేక వ్యాపారాలు నడవడం లేదు. సుమారు 4 నెలలుగా ఎలాంటి శుభకార్యాలు లేక పురోహితులు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయారు. కుటుంబ పోషణే భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సొంతూళ్లకు పయనం..
ఇక కరోనా దెబ్బతో పెళ్లిళ్లు లేక ప్రింటింగ్ షాపుల యజమానులకు కష్టాలు తప్పడం లేదు. ప్రతిషాపులో స్థాయిని బట్టి 5 నుంచి 50 మంది వరకు పనిచేసే వారు. ఇప్పుడు పనిలేక చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోగా.. ఉన్నవారితోనే పనికానిస్తున్నారు యజమానులు.
ఫొటోలు, వీడియోలు లేవు..
వివాహాలకు అతి తక్కువ మందికే అనుమతి ఇవ్వడం వల్ల ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఆసక్తి కనబరచడం లేదు. కనీసం షాపుల అద్దె కూడా చెల్లించలేక అప్పులు చేయాల్సి వస్తోందని ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.