రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు మినహా అన్ని కీలక రంగాలపై కరోనా ప్రభావం చూపింది. అత్యధికంగా ఉపాధిని కల్పించే రంగాలను బాగా దెబ్బతీసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి ఇది కొనసాగుతోంది. లాక్‌డౌన్ ఎత్తివేసినా వివిధ రంగాలు అంతగా కోలుకోలేదు. తయారీ, నిర్మాణం, వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్‌లు, అన్ని రకాల రవాణా రంగాలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. ఈ రంగాలన్నింటిలోనూ 2019-20 కంటే 2020-21లో ఉత్పత్తి తగ్గింది.
గత ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాల ఉత్పత్తికి సంబంధించి రాష్ట్ర స్థూల విలువ జోడింపు (గ్రాస్ స్టేట్ వ్యాల్యూ యాడెడ్- జీఎస్‌వీఏ) తుది గణాంకాలు సిద్ధమయ్యాయి. వాటిని రాష్ట్ర అర్థ గణాంక శాఖ ఇటీవల కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖకు అందించింది. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పత్తి భారీగా పెరిగిన నేపథ్యంలో మిగిలిన విభాగాల్లో ఉత్పత్తి తగ్గినా జీఎస్‌వీఏతో పాటు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రాడక్ట్- జీఎస్‌డీపీ)లో అంతకు ముందు ఏడాది కంటే 2.4 శాతం పెరుగదల నమోదైంది. వాస్తవంగా 2014-15 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు జీఎస్‌డీపీ సగటు వృద్ధిరేటు 13 ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో 2.4 శాతానికి పరిమితమైంది.