తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒకప్పుడు రాజసం... ఇప్పుడు మహాప్రస్థానం - corona effect

హైదరాబాద్​ నగరవ్యాప్తంగా కర్ఫ్యూ. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు. అంతటా అలుముకున్న నిశ్శబ్దం. ఇంతటి చీకటిలో రాత్రి 9 నుంచి తెల్లవారుజాము వరకూ అంబులెన్సులు పెట్టే సైరన్ల మోతలు నగరంలో ప్రస్తుతం కరోనా హోరును ప్రతిబింబిస్తున్నాయి. కరోనా బాధితులను ఆసుపత్రులకు తీసుకెళ్లేవి కొన్ని.. ఆఖరి క్షణాల్లో ఉన్న వారిని మెరుగైన ఆసుపత్రులకు మార్చేవి మరికొన్ని.. మహమ్మారితో పోరాడి ఓడిన వారి మృతదేహాలను శ్మశాన వాటికలకు తరలించేవి ఇంకొన్ని.

corona-effect-on-hyderabad
ఒకప్పుడు రాజసం... ఇప్పుడు మహాప్రస్థానం

By

Published : Apr 28, 2021, 7:43 AM IST

మహానగరం రహదారులు ఎన్నో విపత్తులు.. మరెన్నో ఉద్యమాలకు సజీవ సాక్ష్యాలు. వందల ఏళ్లనాటి చారిత్రక సోయగాలకు.. శాస్త్రసాంకేతిక పరిశోధనలకు వేదిక ఇది. ఎన్నో వైపరీత్యాలను తట్టుకుని ముందుకు సాగుతోందీ నగరం. లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. సామాన్యుడి నుంచి సంపన్నుల వరకూ అక్కున చేర్చుకుని ఆకలి తీరుస్తోంది. భవిష్యత్తుకు బోలెడంత భరోనా కల్పిస్తోంది.

కోటి జనాభా ఉన్న భాగ్యనగరి ఆనందాలు.. అనుభూతులను పంచే సిరి. రేయింబవళ్లు ఒకే వాతావరణం. అర్ధరాత్రి దాటినా ధైర్యంగా ఆరుబయటకెళ్లి కుటుంబంతో కలసి అలా ట్యాంక్‌బండ్‌పై చక్కర్లు కొట్టి.. చార్మినార్‌ వద్ద ఐస్‌క్రీమ్‌ ఆస్వాదించే అవకాశం ఉన్న ప్రాంతం. ఎప్పుడూ.. ఆనందాన్ని పంచుతూ.. తన చల్లనిఒడిలో సేదతీరే అవకాశాన్ని పంచిన నగరం ప్రస్తుత కరోనా కరాళ నృత్యంతో కన్నీరు పెడుతోంది. కళ్లెదుట వందలాది మంది కనుమూస్తుంటే తల్లడిల్లిపోతోంది. కిక్కిరిసిన ఆసుపత్రులు.. ఆరుబయట రోదనలు.. ఖాళీలేని పలు శ్మశానవాటికల వద్ద పరిస్థితిని చూస్తూ మౌనంగా దుఖిస్తోంది.

ఇదీ చూడండి:కర్ఫ్యూ తర్వాత ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details