కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా హోటళ్లు, లాడ్జ్‌లు, గెస్ట్‌హౌస్‌లు కుదేలవుతున్నాయి. రెస్టారెంట్లు, బ్యాంకెట్ హాళ్లదీ అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లో ఇన్నాళ్లూ అడపాదడపా సమావేశాలతో... ప్రధాన నగరాల్లో ఆతిథ్యరంగానికి ఆక్యుపేషన్‌లో ఢోకా లేకుండా ఉండేది. విజయవాడలో త్రీ స్టార్, ఆపై రేటింగ్ ఉన్న హోటళ్లు సుమారు 10 ఉన్నాయి. త్రీ స్టార్ లోపు రేటింగ్‌తో 100 వరకూ ఉన్నాయి. లాడ్జ్‌లు, ఇతర చిన్నతరహా హోటళ్లు మరో 300 వరకూ ఉన్నాయి. వీటికి అనుబంధంగా 150 పెద్ద రెస్టారెంట్లు సహా చిన్న, మధ్యతరహా రెస్టారెంట్లు 250 వరకూ ఉన్నాయి. ప్రభుత్వ అనుబంధ కార్యక్రమాలు తగ్గడం, రాజధాని మార్పు ప్రకటన పరిణామాలతో... ఇప్పటికే వీటిల్లో ఆక్యుపెన్సీ 60 నుంచి 40 శాతానికి పడిపోయిందని యజమానులు చెబుతున్నారు. ఇప్పుడు వైరస్ దెబ్బ... మూలిగే నక్కపై తాటికాయ పడినట్లైందని వాపోతున్నారు.
కొన్ని రోజుల్లో లాక్‌డౌన్ ఎత్తేసినా జనం ఇప్పటికిప్పుడు హోటళ్ల గడప తొక్కే అవకాశం లేదని నిర్వాహకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గడం వల్ల ఇప్పట్లో ఎవరూ ఇళ్ల నుంచి కదలకపోవచ్చని అంటున్నారు. అనేక కారణాలతో నష్టాలు చవిచూడక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఆదాయం లేక... నష్టాలు భరించలేక..ఇప్పటికే ఉద్యోగులు, సిబ్బందిని చాలా హోటళ్లు ఇళ్లకు పంపేశాయి.