సజీవకళ ఉట్టి పడే వివిధ కళాకృతులను తయారుచేసే హస్త కళాకారులు కరోనా కారణంగా పూట గడవక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మంది హస్త కళాకారులందరిదీ ఇదే పరిస్థితి. కరీంనగర్‌లోని ఫిలిగ్రి, పెంబర్తి నకాషీ, నిర్మల్ కొయ్యబొమ్మలు, కుమురం భీమ్ జిల్లాలో డోక్రా, చేర్యాల చిత్రాలు, హైదరాబాద్ పాతబస్తీ లోని బిద్రి కళారూపాలను చేతితోనే తయారు చేస్తుంటారు. వీటి తయారీకి ఉపయోగించే కలపతో పాటు ముడి సరకులు, రాగి, ఇత్తడి, వెండి తదితర లోహాల కొనుగోలుకు కళాకారులు భారీగా పెట్టుబడులు అవసరం. అప్పులు చేసి వీటిని కొనుగోలు చేస్తూ తమ వ్యాపారాలను కొనసాగిస్తుంటారు.
నిత్యం రాష్ట్ర హస్తకళల సంస్థ- గోల్కొండకు, వివిధ ప్రభుత్వ శాఖలకు కళాకృతులను విక్రయిస్తుంటారు. స్థానికంగా సహకార సంఘాల ద్వారా దుకాణాల్లో అమ్ముతుంటారు. లాక్‌డౌన్ కారణంగా సాధారణ ఆర్డర్లు నిలిచిపోయాయి. మార్చిలో లాక్‌డౌన్ తర్వాత గోల్కొండ షోరూమ్‌లు మూతపడ్డాయి. దీంతో కళాకారుల ఉత్పత్తుల కొనుగోళ్లు ఆగిపోయాయి. పనులు లేక కార్మికులు మూడు నెలల పాటు విలవిల్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన రేషన్ మినహా వారికి ఏ ఆదాయం లేదు. దీంతో చాలామంది కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి అగచాట్లు పడ్డారు. కొంతమంది కూలి పనులకు వెళ్లారు.
లాక్‌డౌన్‌పై సడలింపుల అనంతరం అందరికీ వెసులుబాట్లు కలిగినా హస్త కళాకారుల జీవితాల్లో చీకట్లు తొలగిపోలేదు. ఇప్పటికీ వారికి ఆర్డర్లు రావడం లేదు. గోల్కొండ దుకాణాలు తెరిచినా అమ్మకాలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. హస్తకళాకారులకు సాధారణ పథకాలు మినహా ప్రత్యేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సాయం అందలేదు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో వీరికి అవకాశం లభించలేదు. గోల్కొండ సంస్థకు ఆదాయం లేకపోవడంతో ఆదుకోలేకపోతోంది. పింఛను, పీఎఫ్ వంటివి కూడా లేక వీరికి ఆసరా లభించడం లేదు.