తెలంగాణ

telangana

ETV Bharat / state

బల్దియా ప్రచారంపై కరోనా ఎఫెక్ట్.. సోషల్ మీడియాపైనే అభ్యర్థుల ఆశలు

సాధారణంగా ఎన్నికలంటే అభ్యర్థులు టిక్కెట్‌ దక్కించుకోవడం నుంచి గెలిచే వరకు తీవ్రంగా శ్రమిస్తారు. ఇంటింటికి తిరిగి తనకే ఓటు వేయాలని కోరుతుంటారు. కార్యకర్తలు, అభిమానులను వెంట తీసుకెళ్లి ప్రచారం చేస్తుంటారు. ఎంతో మందికి ఉపాధి కూడా లభిస్తుంది. ముఖ్యంగా అడ్డాకూలీలకు ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. కరోనా కారణంగా ఈ సారి ఇందుకు భిన్నమైన వాతావరణం నగరంలో నెలకొంది.

corona effect on ghmc election campaign 2020
బల్దియా ప్రచారంపై కరోనా ఎఫెక్ట్

By

Published : Nov 20, 2020, 9:30 AM IST

హైదరాబాద్​లో కొవిడ్‌ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ పరిధిలో నిత్యం 300-350 మంది కొవిడ్‌ బారిన పడుతున్నారు. ఈ సారి ప్రచారం చేసే అభ్యర్థులకు ఇదో ప్రతి బంధకంగా మారనుంది. కొవిడ్‌ నిబంధనల ప్రకారం ఒకేచోట ఎక్కువ మంది గుమిగూడటానికి ఆస్కారం లేదు. ఒకవేళ ఒకేచోట చేరినా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దీంతో ఎక్కువ మంది అభ్యర్థులు పరిమిత సంఖ్యలో కార్యకర్తలతో ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. అంతేకాక పూర్తి స్థాయిలో కరోనా జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం.. చేతులను శానిటైజ్‌ చేసుకోవాలి.

గ్రూపులు ఏర్పాటు చేసి..

ఈసారి ఎక్కువ మంది అభ్యర్థులు ప్రచారం కోసం సామాజిక మాధ్యమాల బాట పట్టే అవకాశం ఉంది. కాలనీలు, బస్తీల్లోని 100-200 మందితో గ్రూపులుగా ఏర్పాటు చేసి వాటి ద్వారా తమకే ఓటు వేయాలని ఇప్పటికే కోరుతున్నారు. తాము గెలిస్తే డివిజన్‌కు ఏమి చేయనున్నామో వాటి ద్వారా చెబుతున్నారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ఇతర మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థులు ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాలతో హోరెత్తించనున్నారు. నాంపల్లి, ఎర్రమంజిల్‌ ప్రాంతాల్లో ప్రింటింగ్‌ సుమారు 100 పైనే ఫ్లెక్సీలు, కరపత్రాలు తయారు చేసే యూనిట్లు ఉన్నాయి. కరోనాతో సాగని వ్యాపారం ఇప్పుడు పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details