టర్మరిక్ మిల్క్‌షేక్, అల్లంతో చేసిన కాపచ్చినో అంటూ కొందరు వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రొ చోలే రాప్, ప్రొటీన్ ప్యాక్డ్ చికెన్ స్టీక్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న షాబుదానా వడను మెనూలో జత చేసామంటూ మరికొన్ని రెస్టారెంట్లు ప్రచారం చేస్తున్నాయి. అల్లం, ఓట్స్, దాల్చినచెక్క, తులసి, ఉసిరి, పసుపుల మిశ్రమంతో చేసిన మిఠాయిలు సిద్ధం చేశామంటూ ఇంకొందరు ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లోని ప్రముఖ రెస్టారెంట్‌లు ‘హెల్తీ ప్లేట్ మెనూ’ పేరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. స్మూథీల విక్రయదారులు సైతం ఈ పంథానే ఎంచుకుంటున్నారు. అవకాడో, పాలకూరలతో తయారుచేస్తున్న స్మూథీలను మెనూలో పెట్టినట్లు చెబుతున్నారు.
చితికిన చిరు బతుకులు
అందమైన చార్మినార్ రూపం.. ఆకట్టుకునే పాతబస్తీ ప్రజల జీవన విధానం.. రాత్రి 12గంటలకు వరకు సందర్శకుల తాకిడి.. ఊరించే వంటకాలు ఇలా చెప్పుకొంటూ పోతే ఇంకా ఎన్నో.. అయితే కరోనా ప్రభావంతో పాతబస్తీలో ఈ సందడి మాయమైంది. నాలుగు నెలలుగా చిరువ్యాపారులు, హస్త కళాకారుల జీవితాలు తలకిందులయ్యాయి. గాజులు, జర్దోసీ (ఎంబ్రాయిడరీ), వార్క్ (సిల్వర్ ఫాయిల్), అగర్‌బత్తి, ఆభరణాలు, విగ్రహాల తయారీ రంగాలపైనే వేలాదిమంది ఆధారపడి జీవిస్తున్నారు. స్థానికులు, వలస వచ్చిన చిరు వ్యాపారులు 7000-8000 మంది ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల పస్తులతో గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బతుకులు ఆగమయ్యాయి...
‘డిమాండ్ మీదనే ఆధారపడే వ్యాపారం మాది. రంజాన్‌కు ముందు, తర్వాత చేతినిండా పని దొరికేది. లాక్‌డౌన్‌తో గిరాకీ దెబ్బతింది. సడలింపుల తర్వాత 15 రోజులు మళ్లీ దుకాణాలు మూసేశాం. ఇప్పుడిప్పుడే తెరుస్తున్నాం. ఎవ్వరూ కొనుగోలుకు రావడం లేదు’.. అని చిరు వ్యాపారి నిజాముద్దీన్ తెలిపారు. ‘3 నెలలుగా ఖాళీ. తాజాగా పనుల్లోకి వచ్చాం. డిమాండ్ లేక సిల్వర్ ఫాయిల్ వ్యాపారం అంతంతమాత్రంగానే ఉంది. గతంలో రోజుకు రూ.600 సంపాదించేవాళ్లం. ఇప్పుడు రూ.400 వస్తున్నాయి.’ అని కార్మికుడు అహ్మద్ తెలిపారు.
గృహమే కదా వ్యాయామశాల
ప్రస్తుతం నగర జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఉదయం వేళల్లో వ్యాయామం తప్పనిసరిగా చేసేవారికి జిమ్‌లు ఇంకా తెరవకపోవడం, వైరస్ వ్యాప్తి ఇబ్బందికరంగా మారింది. బరువు పెరగడం, శరీరం వదులుగా తయారవడం, పొట్ట పెరగడం, చురుకుదనం తగ్గిపోవడం తదితర సమస్యలను అనేకమంది ఎదుర్కొంటున్నారు. తమకు అనువుగా ఉండే వ్యాయామ పరికరాలను ఇంట్లోనే ఏర్పాటు చేసుకుని కసరత్తులు చేస్తున్నారు.