విద్యుత్తు ఆదా..
- నెలవారీ బడ్జెట్‌లో ఆదా చేసేందుకు అవకాశం ఉన్న వాటిలో విద్యుత్తు వినియోగం ఒకటి. వృథా ఎక్కడెక్కడ జరుగుతోందో గుర్తించి ఆదా చేసుకోవాలి. స్లాబు పెరిగే కొద్దీ యూనిట్ ఛార్జీ పెరుగుతుందని గుర్తించాలి.
- ఇప్పటికీ చాలామంది ఇళ్లలో, ఇంటి బయట సాధారణ బల్బులు, సీఎఫ్‌ఎల్ వినియోగిస్తున్నారు. వీటి స్థానంలో ఎల్‌ఈడీకి మారితే లైటింగ్ వినియోగంలో 60 శాతం వరకు విద్యుత్తు ఆదా అవుతుంది.
- పది, పదిహేను ఏళ్ల నాటి ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పనిచేస్తున్నాయి కదా చాలామంది వాడుతుంటారు. ఇవి విద్యుత్తును అధికంగా వినియోగిస్తాయి. వీటి స్థానంలో నక్షత్ర గుర్తింపు ఉన్న బీఈఈ రేటింగ్ కలిగిన ఉపకరణాలు మేలు.
- వాషింగ్ మెషన్‌కు సరిపడా దుస్తులు ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. స్నానం చేసేందుకు గీజర్‌ను అందరూ తలోసారి వేయకుండా.. ఒకసారి వేశాక అందరూ వెంటవెంటనే ఉపయోగిస్తే కరెంట్ బిల్లు చాలా వరకు ఆదా అవుతుందంటున్నారు.
తలంటు దగ్గర్నుంచి..
- దాదాపు ప్రతి ఇంట్లో ఇప్పుడు షాంపు వినియోగం తప్పనిసరి. సాధారణంగా షాంపూ డబ్బాల మూత పెద్దదిగా ఉంటుంది. అది వ్యాపార సూత్రం. నొక్కితే ఒకేసారి ఎక్కువ మొత్తం చేతిలోకి వస్తుంది. ఒక్కసారి బయటికి వచ్చాక ఎక్కువైనా తిరిగి డబ్బాలోకి పంపలేం. కాబట్టి అవసరానికి మించే తలకు రుద్దుకుంటాం.
- డబ్బాను నొక్కేటప్పుడు.. అరచేతిపైన కాకుండా చేతి వేళ్లను డబ్బా మూతికి అడ్డుపెట్టి నొక్కాల్సి ఉంటుంది. అప్పుడు అవసరమైన మేరకే చేతిలోకి వస్తుంది.
- ఎక్కువ గాఢత కలిగిన మిశ్రమం కాబట్టి రెండు మూడు చుక్కల షాంపు తలకు సరిపోతుంది. మాడుపై నుంచి రుద్దుకుంటే వెంట్రుకల మొత్తానికి సరిపోతుంది.