పాల ప్యాకెట్లు, కూరగాయలు, పండ్లు....ఒకటేమిటి ఇలా ఏ వస్తువు ఇంటికి తెచ్చుకున్నా గంటలకొద్దీ నీళ్లలో నానబెట్టడం.. రసాయనాలతో కడగడం ద్వారా కరోనా వైరస్ బారినపడకుండా జాగ్రత్తపడుతున్నామనే భావనలో కొందరున్నారు. అట్టపెట్టెల్లో వచ్చే పార్శిళ్లను గంటల తరబడి ఎండలోపెట్టి, రసాయనాల్లో ముంచితే తప్ప ఇంట్లోకి తీసుకెళ్లని వారూ ఉన్నారు. ఇదే సమయంలో కొందరు దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ముఖానికి మాస్కులు ధరించకపోవడం, యథేచ్ఛగా గుంపుల్లో తిరగడం వంటివి చేస్తున్నారు. ఏదైనా కొత్త వస్తువు లేదా ఉపరితలాలను ముట్టుకున్న సందర్భాల్లో చేతులు శుభ్రపర్చుకోవాలనే కనీస కొవిడ్ నిబంధననూ పాటించడం లేదు. మహమ్మారి మన మధ్యకు వచ్చి దాదాపు 10 నెలలు గడిచినా, వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది? వేటి ద్వారా వ్యాపించదు? ఏ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నివారించవచ్చు? తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కొరవడటం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికాలోని సెంటర్ డీసీజ్ కంట్రోల్(సీడీసీ), ఐసీఎంఆర్ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థలు వాస్తవాలను వెల్లడిస్తున్నప్పటికీ కొన్ని సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారంతో ప్రజలు గందరగోళానికి లోనవుతున్నారని అభిప్రాయడుతున్నారు. కొవిడ్ వ్యాప్తిపై వాస్తవాలను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని, అనవసర భయాందోళనలకు గురికావద్దని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. సూక్ష్మ రంధ్రాలతో పొరలుపొరలుగా ఉండే కాగితాలు, అట్టపెట్టెలు, దుస్తుల ఉపరితలాలపై వైరస్ ఎక్కువ కాలం జీవించదని చెబుతున్నారు.
కాగితాలతో వ్యాప్తి అపోహే..
అతి సూక్ష్మ రంధ్రాలతో పొరలుపొరలుగా ఉండే వస్తువుల ఉపరితలాలపై వైరస్ ఎక్కువ కాలం జీవించదు. ఉదాహరణకు కాగితాలు, వార్తా పత్రికలు, అట్టపెట్టెలు, లేఖలు, టిష్యూ పేపర్లు, ఆహార పొట్లాలు తదితరాల ద్వారా వ్యాప్తి చెందినట్లుగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ ఒక్క కేసూ నమోదు కాలేదు. ఏ వైద్య పరిశోధనల్లోనూ నిర్ధారణ కాలేదు. ఆహార పదార్థాల ద్వారానూ సోకదు. బయటి నుంచి ఆహార పదార్థాలు వచ్చినప్పుడు మాత్రం పైకవర్‌ను తొలగించి, చేతులను శుభ్రంచేసుకొని తినాలి. కూరగాయలు, పండ్లను సాధారణ నీటిలో శుభ్రం చేస్తే చాలు. వాటిని రసాయనాల్లో శుభ్రపర్చడం ద్వారా విషతుల్యాలు శరీరం లోపలికి వెళ్లే ప్రమాదముంది.
సూదులతో వ్యాపించదు