హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య దాదాపు 520కు చేరుకుంది. మహమ్మారి రోజురోజుకి విజృంభించడం వల్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మే 25వ తేదీ నుంచి నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు పెద్దఎత్తున నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు.
ముషీరాబాద్‌పై కరోనా పంజా... 520కి చేరిన కొవిడ్ బాధితులు - ముషీరాబాద్‌లో కరోనా తాజావార్తలు
హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. ప్రతి రోజూ వెలుగుచూస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 80 శాతం కేసులు ఒక్క హైదరాబాద్ నుంచే వస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. ఒక్క ముషీరాబాద్ నియోజకవర్గంలోనే 500 కేసులు నమోదుకావటం గమనర్హం.
వీరిలో 24 మంది మృతి చెందారని పేర్కొన్నారు. 365 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. మిగితా 131 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. కరోనా మహమ్మారి రోజురోజుకి విస్తరిస్తున్న తమ ప్రాంతాల్లో శానిటైజ్ చేయడం లేదని స్థానికులు ఆరోపించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అధికారులు, ఆశావర్కర్లు అనేక సూచనలు చేస్తున్నప్పటికీ కేసులు ఆగడం లేదని పలువురు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.