Omicron Cases in AP: ఆంధ్రప్రదేశ్‌లో మూడో దశ కొవిడ్ వ్యాప్తి వేగవంతమైంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. వీటిల్లో అత్యధిక కేసులు కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు చెందినవేనని తెలుస్తోంది. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారితో పాటు.. ర్యాండమ్‌గా స్థానికుల నుంచి సేకరించి.. ఇటీవల పంపిన సుమారు వంద నమూనాలను.. హైదరాబాద్‌లోని సీసీఎంబీ పరీక్షించగా.. 80 శాతం వరకు ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసినట్లు తేలింది. ప్రస్తుతం డెల్టా కంటే.. ఒమిక్రాన్ వ్యాప్తి.. ఐదు రెట్లు అధికంగా ఉంటోంది. ప్రజల్లో ఈ వేరియంట్ వ్యాప్తి క్రమంగా పెరిగిపోతోందని కొవిడ్ నియంత్రణ పర్యవేక్షణ సీనియర్ వైద్యులు చెబుతున్నారు. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో ఒమిక్రాన్ బారినపడ్డ వారి వివరాలను చివరిగా.. ఈ నెల 5వ తేదీన వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. అప్పటికి రాష్ట్రంలో 28 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి ఒమిక్రాన్ కేసుల లెక్కలపై ప్రకటనలు వెలువడలేదు.
పండుగ తర్వాత మరింత పెరిగే అవకాశం
ఏపీలో గత నెల 27 నుంచి.. జనవరి 9 వరకు.. 864 మంది కొవిడ్ బాధితులు ఆస్పత్రుల్లో చేరారు. విజయవాడ జీజీహెచ్‌లో కరోనా ఓపీకి.. అనుమానిత లక్షణాలు కలిగిన వారి నుంచి.. అలాగే పాజిటివ్ బాధితులతో సన్నిహితంగా మెలిగామని వచ్చిన వారి నుంచి... 150 నమూనాలు సేకరించారు. జనవరి 1కి ముందు ఆ సంఖ్య 15 నుంచి 25 మధ్య ఉంది. జనవరి 1 నాటికి ఏపీలో పాజిటివిటీ రేటు 0.57 శాతం ఉండగా.. అది మంగళవారానికి 5.01 శాతానికి పెరిగింది. స్వల్ప వ్యవధిలోనే పెరిగిన పాజిటివిటీ రేటును పరిశీలిస్తే.. సంక్రాంతి పండుగ తర్వాత కొవిడ్ మరింత ఉద్ధృతమవుతుందని.. వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా.. కృష్ణా, విశాఖ, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో పాజిటివ్ కేసులు 5 శాతం దాటుతాయని అంచనా వేస్తున్నారు.