ఫిర్యాదుల దినం రోజు తక్కువలో తక్కువ ఒక్కో జిల్లా కేంద్రానికి 100 మంది వరకు బాధితులు వస్తున్నారు. డివిజన్ కార్యాలయాలకు ముప్ఫై మంది వరకు వస్తున్నారు. ఫిర్యాదుదారులు రాగానే సమస్యలను ముందుగా నమోదు చేసుకుంటారు.
పత్రాలను, సమస్యను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. బాధితులు నేరుగా ఉన్నతాధికారులను కలిశాక వారి ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు స్పందిస్తుంటారు. ఈ క్రమంలో కనీసం ఏడెనిమిది మంది సిబ్బంది బాధితులతో మాట్లాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇదే వైరస్ బారిన పడటానికి కారణమవుతోంది. లాక్‌డౌన్ ఎత్తివేసిన అనంతరం క్రమంగా ప్రజల నుంచి దరఖాస్తులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలా? వద్దా? అనే సందిగ్ధతలో కొన్ని జిల్లాల అధికారులున్నారు.
- హైదరాబాద్ కలెక్టరేటు, పలు విభాగాల్లో 15 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో మిగిలిన సిబ్బంది ఆందోళనలో ఉన్నారు.
- మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తహసీల్దారు మల్లేశ్ కరోనాతో వారం రోజుల క్రితం మృతిచెందారు. పెద్దపల్లి, గజ్వేల్ ఆర్డీవో కార్యాలయాల్లో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
- కరీంనగర్, అమీన్‌పూర్, మిర్యాలగూడలో పలువురికి వైరస్ నిర్ధారణ అయింది.
- కలెక్టరేట్లలో ఉండే వివిధ సెక్షన్ల అధికారులు, సిబ్బంది ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు, సర్క్యులర్ల జారీ, ఉన్నతాధికారులు, ఇతర సిబ్బందితో సంప్రదింపులకు జంకుతున్నారు.
- మ్యుటేషన్లు ఇతరత్రా క్షేత్ర స్థాయి భూసంబంధిత విచారణలు, పంచనామాలు, కరోనా బాధితుల గుర్తింపు అనంతరం చేపట్టాల్సిన చర్యలకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉండటంతో అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
- ఈ కారణంతో కొన్ని కార్యాలయాల్లో ఫిర్యాదులు తీసుకునేందుకు ప్రత్యామ్నాయమార్గాలను అనుసరిస్తున్నారు.