తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో 45కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు - 45కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45కి పెరిగింది. గురువారం కొత్తగా ఇద్దరు వైద్యులు సహా నలుగురికి కొవిడ్‌- 19 సోకగా వారిలో ముగ్గురు రెండోదశ బాధితులుగా ప్రభుత్వం తెలిపింది. ఆ ముగ్గురితో కలిపి... ఇప్పటివరకూ రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్ట్‌ కేసుల సంఖ్య 9కి చేరగా..... మూడోదశ ప్రారంభమైతే తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఈటల రాజేందర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

Corona cases reached to 45 in telangana
Corona cases reached to 45 in telangana

By

Published : Mar 27, 2020, 5:41 AM IST

Updated : Mar 27, 2020, 11:27 AM IST

రాష్ట్రంలో 45కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో గురువారం కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఇద్దరు వైద్యులు కాగా.. నలుగురిలో ముగ్గురికి రెండో దశలో కొవిడ్‌- 19 సోకినట్లు అధికారులు వివరించారు. ఈ నలుగురితో కలుపుకొని తెలంగాణలో మొత్తం కేసులు సంఖ్య 45కు చేరింది. వీరిలో 44 మంది చికిత్స పొందుతున్నారు. మరొకరు డిశ్చార్జి అయ్యారు. నిన్నటి కేసుల్లో ఇద్దరు దిల్లీ నుంచి రాగా మిగిలిన ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వైద్యులు. భార్యాభర్తలైన ఇద్దరు వైద్యులు... ఇటీవల దేశంలోని వివిధప్రాంతాల్లో పర్యటించి వచ్చినట్టు.. వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

107 మందికి పరీక్షలు...

ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో పనిచేసే వీరు ఈనెల 14 నుంచి 16 వరకు సెలవులపై ఇంట్లోనే ఉన్నారు. 17న విమానంలో తిరుపతిలో ఓ వైద్యుడిని కలిసి తిరిగి హైదరాబాద్‌కి వచ్చారు. తర్వాత రెండు రోజులపాటు ఇంట్లోనే ఉన్నారు. 20న విధులకు వెళ్లి ఆరోగ్యం బాలేక గంటలోనే భర్త తిరిగి ఇంటికి రాగా.. 21న అతడికి చేసిన పరీక్షల్లో పాజిటివ్ తేలింది. భార్యకి వ్యాధి సోకినట్టు గుర్తించారు. ఇక మిగిలిన ఇద్దరిలో ఒకరు.. 45 ఏళ్లు, మరొకరు 49 ఏళ్ల వ్యక్తులు కాగా.. హైదరాబాదీలైన వీరు ఇటీవలే దిల్లీ నుంచి వచ్చినట్టు... వైద్యులు గుర్తించారు. వీరిలో ఒకరు సికింద్రాబాద్, మరొకరు కుత్బుల్లాపూర్ వాసిగా ప్రభుత్వం ప్రకటించింది. నిన్న మొత్తం 107మందికి పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం 25 మంది ఫలితాలు వెల్లడించింది.

కరోనా కోసం గాంధీ ఆస్పత్రి...

రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో... వైద్య ఆరోగ్య శాఖ మరింత అప్రమత్తమైంది. గాంధీ ఆస్పత్రిని పూర్తి స్థాయిలో కరోనా రోగుల కోసం సిద్ధం చేయాలని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. ఇప్పటికే కోఠిలోని ఆస్పత్రిని కరోనా రోగుల కోసం సిద్ధం చేయగా.. పాతబస్తీలోని యునాని ఆస్పత్రి సహా ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని కోరారు. మూడోదశకి కరోనా వెళ్తే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఈటల సూచనలు చేశారు.

వీడియో కాన్ఫరెన్స్...

వైద్యులకు ఎలాంటి సెలవులు ఇవ్వొద్దని ఏఎన్​ఎంలు, ఆశా వర్కర్లలని కరోనా కట్టడికి పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పేర్కొన్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఈటల... తెలంగాణకి ఎన్- 95మాస్కులు సహా.. పర్సనల్ ప్రొటెక్షన్ కిట్​లు, వెంటిలేటర్స్‌ని అందించాలని కోరారు. పర్సనల్ ప్రొటెక్షన్ కిట్ల తయారీకి డీఆర్​డీఓ, బీడీఎల్, ఈసీఎల్​కి అనుమతులివ్వాలని కోరారు.

ఇదీ చూడండి:నిబంధన అతిక్రమిస్తే చలానా ఇంటికొస్తుంది: డీజీపీ

Last Updated : Mar 27, 2020, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details