తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో పెరుగుతోన్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..!

రాష్ట్రంలో కొవిడ్ మరోమారు పంజా విసురుతోంది. ముఖ్యంగా జీహెచ్​ఎంసీ పరిధిలో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు 90 శాతం గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలోనివే కావటం గమనార్హం. ఈ నేపథ్యంలో పని ప్రదేశాలు, జనసమర్థ ప్రాంతాల్లో తప్పక మాస్కులు ధరించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

రాష్ట్రంలో క్రమంగా పెరుగుతోన్న కరోనా కేసులు.. ప్రభుత్వం అప్రమత్తం
రాష్ట్రంలో క్రమంగా పెరుగుతోన్న కరోనా కేసులు.. ప్రభుత్వం అప్రమత్తం

By

Published : Jun 24, 2022, 7:24 PM IST

Updated : Jun 24, 2022, 7:31 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇవాళ 29,084 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 493 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​ బారి నుంచి 219 మంది కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 3,322 యాక్టివ్ కేసులున్నాయి. ముఖ్యంగా జీహెచ్​ఎంసీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత వారం రోజుల్లోనే నగరంలో కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా 219 కేసులు నమోదు కాగా... అందులో 194 కేసులు.. అంటే 88 శాతం కేసులు ఈ మూడు జిల్లాల్లోనివే. ఈ నెల 19న అత్యధికంగా 94 శాతం ఈ 3 జిల్లాల్లోనే నమోదయ్యాయి. వారం రోజుల క్రితం హైరాబాద్​లో రోజుకు 150 వరకు ఉన్న కొవిడ్ కేసులు.. ఇప్పుడు ఏకంగా 500 చేరువగా నమోదవుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం కేవలం 16 నుంచి 17 జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయి. సంగారెడ్డిలో తాజాగా 10కి పైగా కేసులు నమోదు కాగా.. మిగతా జిల్లాల్లో 5కు మించి కరోనా కేసులు నమోదు కావటం లేదు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అర్హులైన వారికి వేగంగా కొవిడ్ టీకాలు పంపిణీ చేస్తుండటంతో పాటు.. 10 ఏళ్ల చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వారు సహా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా సంచరించవద్దని సూచించింది. మాస్కు ధరించడం సహా భౌతిక దూరం నిబంధనలు పాటించాలని చెప్పింది. లక్షణాలు ఉన్న వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని పేర్కొంది.

Last Updated : Jun 24, 2022, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details