హైదరాబాద్ నగరంతో పాటు పరిసరాల్లోని మున్సిపాలిటీలు, మండలాల్లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 80 శాతం కేసులు నమోదవుతున్నాయి. అంబర్‌పేట పరిధిలో ఇవాళ కొత్తగా 31 కేసులు వచ్చాయి. అంబర్‌పేట డివిజన్ పరిధిలో ఇద్దరు, కాచిగూడ డివిజన్లో ఒకరు కొవిడ్ బారినపడి చనిపోయారు.
పాతబస్తీ గల్లీల్లో కరోనా లొల్లి...
పాతబస్తీలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. చంద్రాయాణగుట్ట నియోజకవర్గంలో ఇవాళ మొత్తం 38 మందికి కరోనా నిర్ధరణ అయింది. వీటితో ఇప్పటి వరకూ ఒక్క చంద్రాయణగుట్ట పరిధిలో మొత్తం కేసుల సంఖ్య 518కి చేరింది. రాజేంద్రనగర్ పరిధిలో 16 పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఇప్పటివరకు మొత్తం కేసులు 365 కు చేరాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఇవాళ 181 కరోనా పరీక్షలు చేయగా అందులో 59 పాజిటివ్‌గా తేలాయి.
కూకట్‌పల్లిలో 54, జూబ్లీహిల్స్‌లో 62...
సురారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 75 పరీక్షలు చేయగా 16, షాపూర్ నగర్లో 65 మందికి పరీక్షలు నిర్వహించగా 27, కుత్బుల్లాపూర్‌లో 18 మందిని పరీక్షించగా 11, గాజులరామరంలో 23లో ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. సికింద్రాబాద్ నార్త్‌జోన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 189 మందికి కరోనా పరీక్షలు జరపగా అందులో 22 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ముషీరాబాద్ నియోజకవర్గంలో కొత్తగా 33 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కూకట్‌పల్లి పరిధిలో 54 కొత్త కేసులు వచ్చాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో 62 మందికి కరోనా సోకింది.