తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్​పై కరోనా పడగ... తాజాగా 843 మందికి కరోనా - hyderabad corona cases

గ్రేటర్‌ వ్యాప్తంగా ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహిస్తుండడంతో కరోనా పాజిటివ్‌ కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. ప్రధాన నగరంలో బుధవారం 18 శాతం వరకు పాజిటివ్‌ రేటు పెరిగింది. ఈనెల 8 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్‌ జిల్లాలో 86 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 36,720 మందికి పరీక్షలు నిర్వహించగా.. 6198 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది.

corona cases increasing in greater Hyderabad
corona cases increasing in greater Hyderabad

By

Published : Jul 23, 2020, 6:02 AM IST

గ్రేటర్‌లో బుధవారం 843 మందికి పాజిటివ్‌గా తేలింది. రంగారెడ్డిలో 132, మేడ్చల్‌ జిల్లాలో 96 కరోనా కేసులు నమోదయ్యాయి. గాంధీతోపాటు వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 9 మంది కన్నుమూశారు.

కొన్ని ఇళ్లలో కుటుంబ సభ్యులంతా వైరస్‌ బారిన పడుతున్నారు. ఎవరికైనా ఆరోగ్యం విషమించి మృతిచెందితే కడచూపు దక్కడం లేదు. స్నేహితులు, బంధువులు కూడా దూరంగా ఉంటున్నారు.

మరీ తప్పదు అనుకుంటే...దూరం నుంచి చూసి వస్తున్నారు. కుటుంబ సభ్యులూ కరోనాతో ఆసుపత్రిలో లేదంటే ఇంట్లో ఉంటే వేరే దారి లేక సిబ్బందే ఈ తంతు పూర్తి చేస్తున్నారు.

ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు...

వైరస్‌ సోకిన వెంటనే చాలామందిలో శ్వాసపరంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తొలుత వారం, పది రోజుల వరకు స్వల్ప లక్షణాలు ఉన్నా...కొన్నిసార్లు ఊపిరి కష్టమవుతోందని, ఛాతీ పట్టేసినట్లు ఉంటోందని అంటున్నారు.

108 వాహనాలకు ఫోన్‌ చేసి తమను ఆసుపత్రికి తరలించాలని ప్రాధేయపడుతున్నారు. స్నేహితులు, బంధువులకు ఫోన్లు చేసి ఏదోలా ప్రైవేటు ఆసుపత్రి లేదంటే గాంధీలో చేరుతున్నారు.

శివారుల్లో పరిస్థితి చూస్తే..

మల్కాజిగిరి, మౌలాలి, మల్లికార్జున్‌నగర్‌ పరిధిలో బుధవారం 18, ఉప్పల్‌లో 75, కాప్రాలో 9, ఇబ్రహీంపట్నంలో 15 మంది కరోనా బారిన పడ్డారు.

అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నెగెటివ్‌ వచ్చినా...పలువురిలో కరోనా లక్షణాలు కన్పిస్తున్నాయి. ఇలాంటివారిని ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

వీటిని గాంధీ, నిమ్స్‌, ఉస్మానియా, ఫీవర్‌, ఐపీఎం, సీసీఎంబీ...ఇలా కొన్నిచోట్ల మాత్రమే చేస్తున్నారు. అందరికీ అందుబాటులో లేకపోవడంతో చాలామంది చేయించుకోకుండానే బయట తిరుగుతున్నారు. ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు కూడా ముమ్మరం చేయాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 1,554 కరోనా కేసులు.. 9 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details