గ్రేటర్‌లో కరోనా వైరస్ కళ్లెం లేకుండా పరుగెడుతోంది. శుక్రవారం రికార్డుస్థాయిలో 329 మందికి పాజిటివ్ వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో గరిష్ఠంగా 129 మందికి వైరస్ సోకింది. మేడ్చల్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు మృతి చెందారు. తాజాగా పంజాగుట్ట, టప్పాచబుత్ర, సుల్తాన్‌బజార్‌లోని ఇద్దరు పోలీసు అధికారులు సహా కొందరు పోలీసు సిబ్బందికి మహమ్మారి సంక్రమించింది. కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో 33 మంది సిబ్బందికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.
కేసుల వివరాలిలా..
తేదీ | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
కేసుల సంఖ్య | 143 | 175 | 133 | 179 | 195 | 189 | 165 | 214 | 302 | 329 |
'ప్రైవేటు'లో తిరస్కరిస్తున్నట్లు ఆరోపణలు
అత్తాపూర్‌లో నివసించే ఓ వ్యక్తి తన భార్యకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని గురువారం రాత్రి పలు ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించాడు. ఒక ఆసుపత్రిలో చేర్చుకుంటామని చెప్పినా ఖర్చు ఎక్కువ అవుతుందని అన్నారు. చివరికి గాంధీ ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ రోగుల కోసం 20-50 పడకలు కేటాయించారు. అన్ని చోట్ల పడకలు నిండిపోతున్నాయి. ఈ కారణంతో కొన్ని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు చికిత్సలు చేయలేమని మరికొన్ని ప్రైవేటు ఆసుపత్రులు తిరస్కరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
బారులు తీరుతున్న అనుమానితులు
కొత్తగా అందుబాటులోకి వచ్చిన కొవిడ్ పరీక్ష కేంద్రాల వద్ద జనం క్యూలు కడుతున్నారు. ప్రతి కేంద్రంలో రోజు 120-200 మంది నమూనాలు సేకరిస్తున్నారు. ప్రైవేటు ప్రయోగశాలలు ఒక్కో పరీక్షకు రూ.2200 వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటి వద్దకు వచ్చి శాంపిళ్లు సేకరించాలంటే రూ.2800 వరకు చెల్లించాలి. ఈ ధరలకు గిట్టుబాటు కాక కొన్ని ప్రైవేటు ల్యాబ్‌లు ముందుకు రావడం లేదు. ఈ తరుణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత ల్యాబ్‌లకు రద్దీ పెరిగింది.