ఏపీలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. వారాలు గడుస్తున్నా వైరస్ వ్యాప్తి ఆగడంలేదు. ప్రస్తుతం పట్టణాల కంటే పల్లెల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఏప్రిల్ తొలివారంలో పట్టణాలు/నగరాల్లో 60% కేసులు నమోదయ్యాయి. పల్లెల్లో 40% వచ్చాయి. తాజాగా దీనికి భిన్నంగా పట్టణాల్లో 44%, పల్లెల్లో 57% కేసులొచ్చాయి. రాకపోకలు పెరిగిపోతుండడం వల్ల పల్లెల్లో వ్యాప్తి తీవ్రంగా ఉంటోంది.
ఈనెల 5 నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చినప్పటికీ కేసుల నమోదుపై తగిన ప్రభావం కనిపించలేదు. ఏప్రిల్ 1 నుంచి మే 16 వరకుచూస్తే కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత వారంలో 38.79% కేసుల నమోదుతో తూ.గో.జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. 10.98% కేసులతో కృష్ణా జిల్లా చివరి స్థానంలో ఉంది. ఏప్రిల్ 1 నుంచి 7వ తేదీ మధ్య రాష్ట్రంలో 2,19,404 నమూనాలను పరీక్షించగా 5.14% పాజిటివ్ కేసులు వచ్చాయి. మే 8 నుంచి 16వ తేదీ మధ్య 8,14,435 నమూనాలను పరీక్షించగా 23.34% పాజిటివిటీ రికార్డయింది.
ఏప్రిల్ తొలివారంలో ఈ 3 జిల్లాల్లో అత్యధికం
ఏప్రిల్ తొలి వారంలో అత్యధికంగా వైరస్ కేసులు నమోదైన తొలి 3 జిల్లాల్లో గుంటూరు, విశాఖపట్నం, చిత్తూరు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 26,927 నమూనాలను పరీక్షించగా 2,304 (8.56%) కేసులు బయటపడ్డాయి. విశాఖలో 19,179కు 1,591 (8.30%), చిత్తూరు జిల్లాలో 23,518కు 1,939 (8.24%) కేసులు నమోదయ్యాయి.
మే నెలలో..
మే1 నుంచి ఏడో తేదీ వరకు పాజిటివిటీ రేటు తూర్పుగోదావరి (32.94), శ్రీకాకుళం (26.84), కర్నూలు (26.78)లో నమోదయ్యాయి. మే 8 నుంచి 16 మధ్య అత్యధికంగా కేసులు నమోదైన 3 జిల్లాల్లో తూర్పుగోదావరి, అనంతపురం, కడప ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 64,663 నమూనాలను పరీక్షించగా 25,083 (38.79%) మందికి వైరస్ సోకినట్లు తేలింది. అనంతపురం జిల్లాలో 52,127 నమూనాలను పరీక్షించగా 19,220 (36.87%) మందికి వైరస్ వచ్చింది. కడప జిల్లాలో 47,719 నమూనాలను పరీక్షించారు. 13,509 (28.31%) మందికి వైరస్ సోకింది.