Corona cases in Telangana Today : తెలంగాణలో గడచిన 24 గంటల్లో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు నైద్యశాఖ స్పష్టం చేసింది. మొత్తం 402 ఆర్టీ పీసీఆర్ (RT-PCR)పరీక్షలు నిర్వహించగా అందులో కేవలం 4 మాత్రమే పాజిటివ్ వచ్చినట్టు ఆరోగ్య సిబ్బంది పేర్కొంది. దాదాపు 6 నెలల తర్వాత రాష్ర్ట ప్రభుత్వం కొవిడ్ బులెటిన్ విడుదల చేసింది. కేరళ సహా పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది.
'కరోనా న్యూ వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలి - స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి'
Covid Cases in India Today: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 341 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో ముగ్గురు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క కేరళలోనే 292 కేసులు నమోదైనట్లు తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,041 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులపై కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది.
దీనిపై కేరళ ఆరోగ్యమంత్రి వీణాజార్జ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు ఆమె చెప్పారు. కరోనా లక్షణాలతో వచ్చిన వారి నమూనాలను జన్యుక్రమ విశ్లేషణకు పంపాలని, కొవిడ్ పరీక్షలను పెంచాలని సూచించారు. రాష్ట్రంలో ఒక వ్యక్తికి మాత్రమే కొవిడ్ ఉపరకం జె.ఎన్.1 ఒమిక్రాన్ సోకిందని, అతడు కోలుకున్నాడని చెప్పారు.