తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగరంపై కరోనా పడగ.. పెరుగుతున్న కేసులు - జీహెచ్ఎంసీ ప‌రిధిలో పెరుగుతున్న కరోనా కేసులు

జీహెచ్​ఎంసీ పరిధిలో కరోనా కోరలు చాస్తోంది. రోజూ పదుల సంఖ్యలో మహమ్మారి బారిన పడుతున్నారు. క‌రోనాపై పోరాడుతున్న వైద్యులు, సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా ప్రతినిధులకూ వైరస్​ సోకుతోంది. బల్దియా మేయర్​ డ్రైవ‌ర్​కు క‌రోనా నిర్ధరణ కావ‌డం వల్ల.. ఇవాళ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్​కు మరోసారి కొవిడ్​-19 పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం బంజారాహిల్స్​, ఎస్​ఆర్​ నగర్​ పోలీస్​ స్టేషన్ల పరిధిలో తొమ్మిది మంది పోలీసులకు కరోనా సోకింది.

corona-cases-in-ghmc-area-increases-daily
భాగ్యనగరంపై కరోనా పడగ.. పెరుగుతున్న కేసులు

By

Published : Jun 13, 2020, 9:33 AM IST

జంట న‌గ‌రాల్లో క‌రోనా విజృంభిస్తోంది. కేవ‌లం జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే రోజూ వందపైనే కేసులు న‌మోద‌వుతున్నాయి. ప్రధానంగా అంబ‌ర్​పేట్, రాంన‌గ‌ర్ వంటి ప్రాంతాల్లో కేసులు క‌ల‌కలం రేపుతున్నాయి. పాజిటివ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాలను కూడా కంటైన్​మెంట్​ జోన్లుగా చేయడం లేదని న‌గ‌రవాసులు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు.

మేయర్​కు వైద్య పరీక్షలు

జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్​కు వైద్యులు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. గురువారం మేయర్ డ్రైవర్​కు కరోనా సోకినట్లు నిర్ధరణ కావడం వల్ల.. మేయర్ నుంచి వైద్యులు శాంపిల్స్ తీసుకున్నారు. గతంలో మేయర్ టీ తాగిన హోటల్​లో మాస్టర్​కు కరోనా రావడం వల్ల.. 10 రోజుల క్రితం బొంతు రామ్మోహన్​కు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్​ వచ్చింది.

పోలీసులకు..

బంజారాహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో ఏఎస్‌ఐ సహా ఐదుగురికి కరోనా నిర్ధరణ అయింది. ఇందులో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు ఉన్నారు. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటివరకు 15 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో నలుగురికి కరోనా నిర్ధరణ అయింది. ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డు కొవిడ్​ బారిన పడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని నేచర్ క్యూర్ ఆస్పత్రికి వైద్యాధికారులు తరలించారు.

పలు ప్రాంతాల్లో కరోనా విజృంభణ

హిమాయత్​నగర్​లోని వాసవి స్కూల్ సమీపంలోని ఓ అపార్ట్​మెంట్​లో తండ్రీకుమారులకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. ప్రస్తుతం వీరిద్దరు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సాగర్​రింగ్​ రోడ్డులోని ఓ టవర్స్​లో ఓ సాఫ్ట్​వేర్ ఇంజనీర్​ కొవిడ్​-19 వైరస్​ బారినపడ్డాడు. గాంధీలో చికిత్స అందిస్తున్నారు. అతని ఇంట్లోని ఆరుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్​లో ఉంచారు. సికింద్రాబాద్ మారేడ్​ప‌ల్లిలోని చికెన్ సెంట‌ర్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తికి వైర‌స్ పాజిటివ్​గా తేలింది. కొండాపూర్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్​కు కరోనా సోకింది. సికింద్రాబాద్ బోయిన్​పల్లిలోని ధనలక్ష్మి కాలనీకి చెందిన ఓ కూరగాయల వ్యాపారి కరోనాతో మృతి చెందారు.

అంబర్​పేట పరిధిలో

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 61 కేసులు నమోదయ్యాయి. వైరస్​ బారిన పడి ముగ్గురు మరణించారు. అంబర్​పేట నియోజకవర్గ పరిధిలో శుక్రవారం 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాగ్​ అంబర్​పేట్​లోని తురబ్​నగర్​లో అధికంగా నాలుగు కేసులు నమోదయ్యాయి. వడ్డెర బస్తీకి చెందిన ఒకరు కరోనాతో మరణించారు. గోల్నాకలో ఒకరు, అంబర్​పేట్​ పరిధిలో కరోనా బారిన పడి ఇద్దరు మృతిచెందారు. తురాబ్​నగర్​లో మొత్తం నలుగురు కరోనా బారినపడ్డారు. పటేల్​నగర్​లో ఓ వృద్దుడు, ప్రేమ్​నగర్​లో క్లాత్ సెంటర్ నిర్వహించే వ్యక్తికి, మారుతీనగర్​లో మరొక వ్యక్తికి, అన్నపూర్ణ నగర్​లోని మరొక వృద్ధుడికి పాజిటివ్ నిర్ధరణ అయింది.

ఇదీ చూడండి :రాష్ట్రంలో కొత్తగా 164 కరోనా పాజిటివ్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details