తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా రోగిని కాపాడుకోవాలిలా... - కరోనా వార్తలు

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వైద్యులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ‘పాజిటివ్‌’ రోగి ప్రాణాలు కాపాడటానికి ప్రాణాలొడ్డి మరీ వైద్యసేవలు అందిస్తున్నారు. వైరస్‌ అనుమానిత లక్షణాలతో వచ్చినవారిని ప్రత్యేక వార్డులో ఉంచి, ఇతరులకు వ్యాప్తి చెందకుండా చూస్తున్నారు.

corona cases caring in ap
కరోనా రోగిని కాపాడుకోవాలిలా...

By

Published : Apr 18, 2020, 5:37 PM IST

కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిశితంగా పరీక్షలు చేస్తున్నారు. శరీర భాగాలు దెబ్బతినకుండా వైద్యం అందిస్తున్నారు. కరోనా చికిత్సలో ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది శ్రమిస్తున్నారు. వైరస్‌ అనుమానిత లక్షణాలతో వచ్చినవారిని ప్రత్యేక వార్డులో ఉంచి, ఇతరులకు వ్యాప్తి చెందకుండా చూస్తున్నారు. తర్వాత రోగి పరిస్థితిని అంచనా వేస్తారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం ఎలా ఉన్నాయో ఎక్స్‌రే, స్కానింగ్‌ ద్వారా తెలుసుకుంటారు. లక్షణాలను బట్టి వారిని ఓపీ, నాన్‌ ఐసీయూ, ఐసీయూ కేటగిరీలుగా విభజిస్తారు. అనుమానిత లక్షణాలున్నవారి నుంచి వైద్యులు గొంతు లేదా ముక్కులో దూదిపుల్లతో స్రావాలను (స్వాబ్‌) సేకరించి, పరీక్షలకు పంపిస్తారు. రోగికి వైరస్‌తో పాటు ఇతర వ్యాధులు ఉండి, పరిస్థితి విషమంగా ఉంటే పెద్దాసుపత్రులకు తరలిస్తున్నారు.

  • ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను అనుసరించి వైద్యులకు రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇచ్చారు.
  • నమూనాలు పరీక్షకు పంపిన తర్వాత 24-48 గంటల్లో ఫలితాలు వస్తున్నాయి. అప్పటివరకు అనుమానిత లక్షణాలున్నవారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచుతున్నారు.

కేటగిరీ1
కరోనా రోగిని కాపాడుకోవాలిలా...

కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చినా లక్షణాలు బయటపడని రకం వీళ్లు. వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. ఇలాంటివారికి బి కాంప్లెక్స్‌, సి విటమిన్లు ఇస్తున్నారు. వీరిని ఐసొలేషన్‌ వార్డులో ఉంచి 14 రోజుల పాటు చికిత్స అందిస్తారు.

కేటగిరీ2
కరోనా రోగిని కాపాడుకోవాలిలా...

వీరికి కొవిడ్‌ వ్యాధి లక్షణాలు కొద్దిగా కనిపిస్తాయి. జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి బయటపడతాయి. ఈ రోగులను గతంలో వేరే వ్యాధులు లేనివారు, ఉన్నవారుగా విభజిస్తున్నారు. వ్యాధులేమీ లేనివారికి విటమిన్‌ బి, సిలతో పాటు పారాసిటమాల్‌ ఇస్తున్నారు.దగ్గు, జలుబుకు చికిత్స చేస్తున్నారు. గతంలో వ్యాధులుంటే పై చికిత్సలతో పాటు హైడ్రాక్సీక్లోరోక్విన్‌, ఫ్లూ మందులు ఇస్తున్నారు. క్యాన్సర్‌, గుండెజబ్బులు ఉంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కేటగిరీ3
కరోనా రోగిని కాపాడుకోవాలిలా...

కొవిడ్‌-19 లక్షణాలు మధ్యస్థం నుంచి తీవ్రంగా ఉండేవారిని ఈ కేటగిరీలోకి తెచ్చారు. వేరే వ్యాధులు ఉన్నా, లేకపోయినా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఇస్తూనే.. శరీర భాగాలు దెబ్బతినకుండా చికిత్స కొనసాగిస్తారు. కేటగిరి-2 కన్నా వీరిపై వైద్యులు ఎక్కువ దృష్టికేంద్రీకరిస్తారు. ఆరోగ్య పరిస్థితిని ఏరోజుకారోజు అంచనా వేస్తూ అవసరమైతే ఐసీయూకు తరలిస్తారు.

కేటగిరీ4
కరోనా రోగిని కాపాడుకోవాలిలా...

వీరిలో లక్షణాలు స్పష్టంగా బయటపడతాయి. వైరస్‌ శరీరంలోని ఇతర భాగాలకూ వ్యాపించడంతో పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. వెంటిలేటర్‌ దాదాపుగా అవసరమవుతుంది. ఐసీయూలో ఉంచి ఆయా భాగాలను కాపాడే మందులతో పాటు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఇస్తారు. ఈ కేటగిరీ రోగుల పరిస్థితి చాలా విషమంగా ఉంటుంది.
అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తారు. పాజిటివ్‌ వస్తే.. వారు ఏ కేటగిరీ రోగులో అంచనావేస్తారు. ఆ తర్వాత 1, 2ఎ, 2బి కేటగిరీల వారిని జిల్లాల్లోని కొవిడ్‌-19 ఆసుపత్రులకు పంపుతారు. కేటగిరీ 3, 4 రోగుల్ని రాష్ట్రస్థాయి ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

  • చికిత్స కోసం జనరల్‌, చెస్ట్‌ ఫిజిషియన్లు ఉంటున్నారు. రోగులు ఐసీయూలో ఉన్నప్పుడు మత్తుమందు వైద్యనిపుణులూ అందుబాటులో ఉంటారు.
  • ప్రతి షిఫ్టులో వైద్యులు, ఇతర సిబ్బంది 20-25 మంది ఉంటారు. మూడు, నాలుగు షిప్టుల్లో వైద్యబృందాలు పనిచేస్తున్నాయి.

వృద్ధులకూ నయమవుతోంది

కొవిడ్‌-19 సోకినవారిలో వయోవృద్ధులకు ప్రాణాపాయం ఎక్కువన్న అభిప్రాయం ఉంది. కానీ, కొన్ని సందర్భాలలో మంచి చికిత్స అందినపుడు వాళ్లూ కోలుకుంటున్నారు. విశాఖపట్నంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన ఓ వృద్ధుడు ఇలాగే వైద్యుల చికిత్సతో కోలుకున్నారు.

నిరంతర పర్యవేక్షణ

డాక్టర్‌ చక్రధర్‌, జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌ఓడీ

ఆసుపత్రుల్లో చేరినవారిని కంటికి రెప్పలా కాపాడుతున్నాం. వృద్ధుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా భోజనం అందిస్తున్నాం. పౌష్టికాహారం కింద కోడిగుడ్లు ఇస్తున్నాం. విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రి నుంచి పాజిటివ్‌ వచ్చినవారు ఇద్దరు డిశ్చార్జి అయ్యారు.

- డాక్టర్‌ చక్రధర్‌, జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌ఓడీ, ప్రభుత్వ వైద్యకళాశాల, విజయవాడ

ABOUT THE AUTHOR

...view details