కరోనా మాట వినబడితేనే వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఇది సోకిన వారందరిలోనూ ప్రాణాంతకం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వారిలో వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. ఈ వయస్సు వారిలో అధిక రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల వైఫల్యం, గుండె జబ్బు ఉండటం అధికమని విశ్లేషిస్తున్నారు. ఈ వ్యాధులేమీ లేకపోతే 60 ఏళ్లు దాటినా కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఇళ్లకెళ్లవచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మహమ్మారి కోరల్లోంచి కోలుకున్న వారి గణాంకాలను పరిశీలించినా.. ఇదే తేటతెల్లమవుతోంది.
50 ఏళ్లు దాటిన వారిలో దాదాపు 28 శాతం మంది ఇప్పటి వరకూ కోలుకోవడం విశేషం. 61 ఏళ్లు పైబడినవారు 11 శాతం మంది కోలుకోగా, 40 ఏళ్లు దాటిన వారిని పరిగణనలోకి తీసుకుంటే.. 46 శాతం మంది ఆరోగ్యవంతులుగా ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. 20-40 ఏళ్ల యువతలో కోలుకునేవారు అత్యధికంగా 47 శాతం మంది ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం విడుదల చేసిన గణాంకాల్లోనూ రాష్ట్రంలో త్వరగా కోలుకునేవారు 22 శాతంగా వెల్లడించారు. ఇది జాతీయ సగటు(14శాతం) కంటే ఎక్కువ. దేశం మొత్తం మీద నమోదవుతున్న మృతుల శాతం(3.22)తో పోల్చితే.. రాష్ట్రంలో మృతుల(2.44) శాతమూ తక్కువే. కరోనా బారిన పడినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, మానసిక ధైర్యంతో వైరస్‌ను ఎదుర్కోవడం సాధ్యమేనని నిపుణులు సూచిస్తున్నారు.
* వైరస్ నిర్ధారించిన 14 రోజుల్లోనే కోలుకున్న వారిలో 8, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు, 19 ఏళ్ల యువకుడు, 65 ఏళ్ల వృద్ధుడు ఉన్నారు.
* వీరిలో ఈనెల తొలిరోజుల్లో గుర్తించిన వారూ ఉండటం విశేషం. కేవలం 14-17 రోజుల్లోనే వీరిలో నెగిటివ్‌గా పరీక్షల్లో తేలింది.