‘రూ.10 లక్షల పెట్టుబడితో 2006లో సంస్థను ప్రారంభించాను. 30 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాను. లాక్‌డౌన్ విధించే సమయానికి కంపెనీలో రూ.15 లక్షల విలువైన ఉత్పత్తి ఆగిపోయింది. కార్మికులకు రెండు నెలల జీతాలు చెల్లించాల్సి వచ్చింది. ఒడ్డున పడాలంటే బ్యాంక్‌లు, ప్రభుత్వం ఆదుకోవడమే మార్గం’.
-జి.ఆనంద్‌కుమార్, ఏవీ పెట్‌టెక్ కంపెనీ
చిన్న పరిశ్రమలపై పెద్ద దెబ్బ - lock down effect on small industries
ఖజానాకు ఆదాయం అందిస్తున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాదాపు 45 రోజులుగా తాళాలు వేసిన పరిశ్రమలను కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలతో ప్రారంభిస్తున్నారు. వలస కూలీలు సొంతూళ్లకు వెళ్తుండడంతో మానవ వనరుల సమస్య తప్పట్లేదు. ముడిసరకు దిగుమతికి ఇబ్బందులు ఎదురవటంతో ఉత్పత్తికి ఆటంకంగా మారిందంటున్నారు పరిశ్రమల యజమానులు.
![చిన్న పరిశ్రమలపై పెద్ద దెబ్బ corona and lock down effect on small scale industries in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7160006-472-7160006-1589246996421.jpg)
ఖజానాకు ఆదాయం అందిస్తున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాదాపు 45 రోజులుగా తాళాలు వేసిన పరిశ్రమలను కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలతో ప్రారంభిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో జీడిమెట్ల, బాలానగర్, పహాడీషరీఫ్, కాటేదాన్, చర్లపల్లి తదితర ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభమవుతున్నాయి. వలస కూలీలు సొంతూళ్లకు వెళ్తుండడంతో మానవ వనరుల సమస్య తప్పట్లేదు. ముడిసరకు దిగుమతికి ఇబ్బందులు ఎదురవటంతో ఉత్పత్తికి ఆటంకంగా మారిందంటున్నారు పరిశ్రమల యజమానులు. ప్రస్తుతం వారం రోజులకు సరిపడా ముడిసరకు మాత్రమే ఉందని చెబుతున్నారు.
చర్లపల్లిలో చిక్కుముళ్లు..
చర్లపల్లి పారిశ్రామికవాడ.. :
సుమారు 800 ఎకరాల విస్తీర్ణంలో ఐదుఫేజ్‌ల్లో విస్తరించింది. ఇక్కడకు వస్తే చాలు ఏదోఒక ఉపాధి దొరుకుతుందనే ధైర్యంతో బిహార్, యూపీ, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది మంది వస్తుంటారు. లాక్‌డౌన్‌తో పరిశ్రమలన్నీ మూతబడ్డాయి. దీంతో ఉపాధి లేక వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరోనా భయం, ఆకలితో ఇబ్బందులు పడుతూ ఇక్కడ ఉండలేక సొంతూరు బాటపడుతున్నారు. వీరంతా తిరిగి పనిలోకి చేరేందుకు మూడు నాలుగు నెలల సమయం పడుతుందని పరిశ్రమల వాళ్లు అంచనా వేసుకుంటున్నారు.
ఊరట కలిగిస్తేనే..
ఈ లాక్‌డౌన్‌లో తమలాంటి చిన్న మధ్య తరహా పరిశ్రమలు పెద్దఎత్తున నష్టంతో నడుస్తున్నాయని నవోదయ ఇండస్ట్రీయల్ అసోసియేషన్ కార్యదర్శి జి.ఆనంద్‌కుమార్ తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన ముడిసరకు లభించే రాణిగంజ్ మార్కెట్, బయట రాష్ట్రాల నుంచి దిగుమతి కావట్లేదన్నారు. ప్రభుత్వం కొన్ని నిబంధనలు సడలించాలని కోరారు. రుణాలు, రాయితీలు అందించాలని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి ముడిసరకు వచ్చినప్పుడే పని ప్రారంభించగలమని ఆశా ఫోర్గింగ్స్ యజమాని శివాజీ తెలిపారు.