తెలంగాణ

telangana

ETV Bharat / state

కుంగుబాటు... కరోనాతో పెరుగుతున్న మానసిక సమస్యలు - కరోనాతో మానసిక సమస్యలు

కరోనా మహమ్మారి వల్ల కలిగిన భయం... ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలకు దారితీస్తోంది. మున్ముందు భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఎక్కువమందిలో ఉంది. వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోవటం, ప్రైవేట్‌ ఉద్యోగాలు ఉంటాయో పోతాయోననే ఊగిసలాట ఈ ఆందోళనను రెట్టింపు చేస్తోంది. ఆదాయం పూర్తిగా తగ్గిపోవటం సైతం మనిషిని మానసికంగా దెబ్బతీస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితిని మానసిక నిబ్బరం కోల్పోకుండా ఎదుర్కోవాలి.

coronavirus
coronavirus

By

Published : Jul 1, 2020, 9:14 AM IST

  • ఉన్నత చదువులకు అమెరికా వెళ్లాలని ఎన్నో ఆశలు. అందుకు తగినట్టుగానే సరదాలు వదిలేసి ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. మే నెలాఖరుకు ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో మహమ్మారి ఆశలన్నీ వమ్ముచేసింది. ఎటూ పాలుపోని స్థితిలోకి నెట్టేసింది. దీంతో ఆ యువకుడు ఆందోళనకు గురయ్యాడు. తిండి మానేసి తనను తాను నిందించుకుంటూ మౌనంగా ఉండేవాడు. గమనించిన తల్లిదండ్రులు మానసిక నిపుణుడి వద్దకు తీసుకెళ్లారు. రెండు కౌన్సెలింగ్‌లు జరిగాక క్రమంగా మార్పు వస్తుందనుకునే సమయంలో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన ఘటన ఇది.
  • పోటీ పరీక్షలు రాసి సర్కారు కొలువు సాధించాలనే ఆశతో హైదరాబాద్ నగరానికి వచ్చిందా యువతి. రెండేళ్లుగా ఇక్కడే ఉంటూ సిద్ధమవుతుంది. ఒకటి రెండు ప్రయత్నాలు విఫలమైనా.. పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితి కూడా దిగజారటంతో ఎటూ పాలుపోని పరిస్థితి. నిద్రాహారాలు మానేసి మానసిక ఒత్తిడికి గురైంది. ప్రస్తుతం సైకాలజిస్టు వద్ద కౌన్సెలింగ్‌ తీసుకుంటోంది.

నలువైపులా ప్రతికూల వాతావరణం. ఏం చేయాలనే అయోమయంలో మానసిక సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని మనస్తత్వనిపుణులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో చాలామంది తాము ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నామనే ఆందోళనకు గురవుతున్నట్టు న్యూరోసైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ హరీశ్ ‌చంద్రారెడ్డి తెలిపారు. కరోనా గురించి ఎక్కువగా ఆలోచించటం, తనకు సోకితే ఎలా ఎదుర్కోవాలనే ఆలోచనలు దీనికి కారణమన్నారు. తెలంగాణ సైకాలజిస్టుల సంఘం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు 230 ఫోన్‌కాల్స్‌ వచ్చినట్టు సంఘ అధ్యక్షుడు డాక్టర్‌ మోతుకూరి రాంచందర్‌ తెలిపారు.

  • కరోనాను తలచుకుంటూ విపరీతమైన భయాందోళనకు గురికావద్ధు అవగాహన పెంచుకుంటూ ఆత్మవిశ్వాసంతో ఉండాలి.
  • వైరస్‌ బారినపడిన వారు క్వారంటైన్‌, ఐసోలేషన్‌లో ఉండటానికి భయపడుతున్నారు. బయట తిరగకుండా ఒంటరిగా ఉండాలనే ఆలోచన దీనికి కారణం. తమ తోటివారికి హాని కలగజేయకుండా ఉండేందుకు ఇదే మార్గమని గుర్తించాలి.
  • ఈ సమయంలో ఏర్పడే భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా, ఈ వ్యాధిని దరిచేరకుండా చూస్తాననే నమ్మకం ముఖ్యం.
  • ఒక దినచర్యకు కట్టుబడి ఉండండి. నిద్రించే సమయం, మేల్కొనే వేళలు, స్వీయరక్షణ నిబంధనలు ఆచరించాలి.
  • రోజూ వ్యాయామానికి ప్రాధాన్యమివ్వాలి. బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు, నడక మానసికంగా చురుగ్గా, దృఢంగా ఉండేలా చేస్తాయి. రోజులో కనీసం అరగంట స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి.
  • సామాజిక జీవితానికి అనుకూలమైన దుస్తులు ధరించండి. ప్రకాశవంతమైన దుస్తులు మనసును ఉల్లాసపరుస్తాయి.
  • ఒంటరితనం అనే భావన కలిగితే సామాజిక మాధ్యమాలతో స్నేహితులతో మాట్లాడండి.

ABOUT THE AUTHOR

...view details