కరోనా వైరస్ సోకిన వారిలో మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బుల వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారే ఎక్కువగా మృత్యువాతపడుతున్నారు. మధుమేహ సమస్య ఉన్నవారికి కరోనా సోకితే... వారికి చికిత్సలో భాగంగా ఇచ్చే స్టిరాయిడ్‌ల వల్ల చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అది మరిన్ని సమస్యలకు దారి తీస్తోంది. మధుమేహ సమస్య ఉన్న వారు మందులు వాడుతూ చక్కెర స్థాయిలు కచ్చితంగా నియంత్రణలో ఉంచుకుంటే.. వారికి కరోనా సోకినా ప్రమాదం తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉన్న వారితో పోలిస్తే లేని వారిలోనే మరణాలు 50 శాతం ఎక్కువగా ఉంటున్నాయని విశాఖలోని ఆంధ్రా మెడికల్ కళాశాల ఎండోక్రైనాలజీ విభాగాధిపతి కె.ఎ.వి.సుబ్రహ్మణ్యం తెలిపారు.
మధుమేహం ఉన్నా లేకపోయినా కొవిడ్ రోగుల్లో సమస్య తీవ్రమైనప్పుడు ప్రాణ రక్షణకు వైద్యులు స్టిరాయిడ్స్ వాడుతున్నారు. రక్తంలో ఆక్సిజన్ ఉండాల్సిన స్థాయి కంటే తగ్గినప్పుడు, శరీరంలో సైటోకైన్ స్టార్మ్ ఏర్పడినప్పుడు, ఆయాసం ఎక్కువగా ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ వాడుతుంటారు. కొందరిలో వ్యాధి లక్షణాలేమీ కనిపించకపోయినా 6 నిమిషాలపాటు వేగంగా నడిస్తే వారిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఆ సమస్యను ‘హ్యాపీ హైపాక్సియా’ అంటారు. అలాంటి సందర్భాల్లోనూ, ఛాతీ ఎక్స్‌రే, సీటీ స్కాన్‌లో ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నట్టు తేలినా స్టిరాయిడ్స్ వాడుతుంటారు.
చక్కెర స్థాయి నియంత్రణే కీలకం
- మధుమేహం ఉన్నవారు, కరోనా లక్షణాలు లేకపోతే ఇది వరకు వాడుతున్న మందుల్నే కొనసాగించాలి. చక్కెర స్థాయుల్ని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. కరోనా లక్షణాలు ఉన్న మధుమేహ రోగుల్లో... కేవలం జ్వరం, ఆయాసం, దగ్గు ఉన్నవారిని ఒక కేటగిరీగా, విరేచనాలు, కడుపులో తిప్పడం వంటి లక్షణాలు కూడా ఉన్నవారిని ఒక కేటగిరీగా పరిగణిస్తారు.
- దగ్గు, కొద్దిపాటి జ్వరం ఉన్నవారు... చక్కెర స్థాయిల నియంత్రణకు ఇది వరకు వాడుతున్న మందులు కొనసాగించాలి. జ్వరం ఉన్నప్పుడు చక్కెర స్థాయిలు కొంత పెరిగే అవకాశం ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా దాన్ని తగ్గించవచ్చు.
- దగ్గుతో పాటు, ఆయాసం కూడా ఉంటే ఆసుపత్రిలో చేరాలి. వారిలో కొందరికి యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం కొందరికే ఉంటుంది. వారిలో చక్కెర స్థాయిల నియంత్రణకు మాత్రలు వేసుకుంటున్న వారికి ఇన్సులిన్ ఇస్తారు. ఎన్నిసార్లు ఇన్సులిన్ ఇవ్వాలన్నది రోగి పరిస్థితిని బట్టి వైద్యులు నిర్ణయిస్తారు.
- వాంతులు, విరేచనాలు అవుతున్నవారు ఆహారం తీసుకోలేరు. అప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్ ద్వారా ఇన్సులిన్ శరీరంలోకి పంపిస్తారు.
మొహమాటం వదిలేయండి
''కరోనా వల్ల ప్రస్తుతం ఆసుపత్రుల్లో పడకలకు కొరత ఉంది. రాబోయే రోజుల్లో అసలు పడకలే దొరకని పరిస్థితి తలెత్తవచ్చు. అందువల్ల కొన్ని రోజులపాటు ఇతర అనారోగ్య సమస్యలేవీ తలెత్తకుండా చూసుకోవడం అవసరం. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడినవారు, మధుమేహం వంటి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారూ మరింత జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఇప్పటికీ... మొహమాటం కొద్దీ పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దాన్ని పూర్తిగా నివారించాలి. బయటకు వెళ్లినప్పుడు మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి.''